📄 ePaper
Thursday, October 1, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్లాల్‌ దర్వాజా బోనాలు.. 8 మంది పాత నేరస్థుల గుర్తింపు!

లాల్‌ దర్వాజా బోనాలు.. 8 మంది పాత నేరస్థుల గుర్తింపు!

ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో పోలీసుల నిఘా.. 116 మంది అనుమానితుల అదుపులోకి

హైదరాబాద్‌, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): లాల్‌ దర్వాజా బోనాల సందర్భంగా హైదరాబాద్‌ పోలీసులు పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ సాయంతో 116 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. వారిలో 8 మంది పాత నేరస్థులను గుర్తించారు. వారిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత పోలీస్‌స్టేషన్లకు అప్పగించారు.

ఆగస్టు 9, 10 తేదీల్లో జరిగిన లాల్‌ దర్వాజా బోనాల వేడుకల్లో జేబు దొంగతనాలు, మొబైల్‌ ఫోన్‌ చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లను అరికట్టేందుకు హైదరాబాద్‌ సీసీఎస్‌ స్పెషల్‌ క్రైమ్‌ టీమ్‌, స్థానిక పోలీసులు విస్తృతంగా నిఘా చేపట్టారు.

ఫేషియల్‌ రికగ్నిషన్‌తో పాత నేరస్థుల గుర్తింపు

లాల్‌ దర్వాజా ఉత్సవ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ (FRS) కెమెరాలను పోలీసుల క్రిమినల్‌ డేటాబేస్‌తో అనుసంధానించి అనుమానితుల వివరాలను పరిశీలించారు. ఈ ప్రక్రియలో 8 మంది గతంలో నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు.

హైదరాబాద్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ (క్రైమ్స్‌ అండ్‌ ఎస్‌ఐటీ) ఎం. శ్రీనివాస్‌ ఐపీఎస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 116 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.

మఫ్టీలోనూ ప్రత్యేక నిఘా

ఉత్సవ ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లోని ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు, రద్దీ ప్రాంతాలు, నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల్లో సీసీఎస్‌ స్పెషల్‌ క్రైమ్‌ టీమ్‌లను ముందుగానే మోహరించారు. మఫ్టీలో ఉన్న పోలీసులు భక్తుల రద్దీలో అనుమానితుల కదలికలను నిశితంగా గమనించారు.

చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులతో పాటు గతంలో ఆస్తి సంబంధిత నేరాలకు పాల్పడిన వారిపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

చోరీలు, చైన్‌ స్నాచింగ్‌లు నమోదు కాలేదు

పోలీసుల విస్తృత నిఘా, సీసీఎస్‌ స్పెషల్‌ క్రైమ్‌ టీమ్‌, స్థానిక పోలీసుల సమన్వయంతో బోనాల వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని అధికారులు తెలిపారు. లాల్‌ దర్వాజా బోనాల సందర్భంగా మొబైల్‌ ఫోన్‌ చోరీ, చైన్‌ స్నాచింగ్‌ లేదా ఇతర చోరీ కేసులు నమోదు కాలేదని అదనపు సీపీ శ్రీనివాస్‌ తెలిపారు.

రద్దీ ప్రాంతాల్లో భక్తులు మొబైల్‌ ఫోన్లు, నగలు, ఇతర విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!