కుత్బుల్లాపూర్, జూలై 1 (నవజ్యోతి ప్రతినిధి):
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్థరాత్రి దొంగలు రెచ్చిపోయారు. జీడిమెట్ల సబ్‌స్టేషన్ సమీపంలోని ఓ కిరాణా దుకాణాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి చోరీకి పాల్పడ్డారు.
దుకాణంలో ఉన్న సుమారు రూ.30 వేల నగదుతో పాటు రూ.50 వేల విలువైన సిగరెట్ బాక్సులను అపహరించి ఉడాయించారు. ఉదయం దుకాణ యజమాని షాప్ వద్దకు వచ్చి చూడగా షట్టర్ తెరిచి ఉండటంతో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. దొంగల కదలికలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో, ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

