వృద్ధురాలి నుంచి రూ.1.43 కోట్ల దోపిడీ…
సుప్రీంకోర్టు జడ్జి పేరుతో వీడియో కాల్స్.. ఆస్తులు అమ్మి డబ్బు జమ చేయాలంటూ బెదిరింపులు
మచిలీపట్నం, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):
కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పరాసుపేటలో ఓ వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ఏకంగా రూ.1.43 కోట్లకు టోకరా వేశారు. ఢిల్లీ పోలీసులమంటూ వీడియో కాల్స్ చేసి, మనీలాండరింగ్ కేసులో మీ పేరు ఉందని భయపెట్టి రెండు నెలల పాటు మానసికంగా వేధించారు.
ముందుగా వాట్సాప్ వీడియో కాల్ చేసిన నిందితులు తాము ఢిల్లీ పోలీసులమని, మీ పేరుతో మనీలాండరింగ్ జరిగిందని, వెంటనే ఢిల్లీకి వచ్చి లొంగిపోవాలని హెచ్చరించారు. అనంతరం సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరుతో మరో వీడియో కాల్ చేసి, విచారణ పూర్తయ్యే వరకు మీ బ్యాంకు ఖాతాల్లోని నగదు కోర్టు ఆధీనంలో ఉండాలని, వెంటనే నిర్దేశించిన ఖాతాలకు బదిలీ చేయాలని నమ్మించారు.
ఈ విషయం కుటుంబ సభ్యులకు లేదా ఇతరులకు చెబితే మీ పేరుతో నేరాలకు పాల్పడిన వ్యక్తులు దాడి చేసి హత్య చేస్తారని బెదిరించడంతో వృద్ధురాలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వారి సూచనల మేరకు మూడు విడతల్లో తన బ్యాంకు ఖాతాల్లోని మొత్తం రూ.1.43 కోట్లను నిందితులు చెప్పిన ఖాతాలకు బదిలీ చేశారు.
అయితే అంతటితో ఆగని కేటుగాళ్లు, ఇంటి ఆస్తులు కూడా విక్రయించి నగదు జమ చేయాలని ఒత్తిడి తేవడంతో వృద్ధురాలికి అనుమానం వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులకు విషయం చెప్పి పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ ఆర్. విద్యాసాగర్ నాయుడు పర్యవేక్షణలో సైబర్ నిపుణుల బృందాలు బ్యాంకు లావాదేవీలు, డబ్బు బదిలీ అయిన ఖాతాలు, కాల్ డేటా, ఐపీ అడ్రస్‌లు, డిజిటల్ ఆనవాళ్లను విశ్లేషిస్తున్నాయి. నిందితులను గుర్తించేందుకు ఇతర రాష్ట్రాల పోలీసులతో కూడా సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు.
జాగ్రత్తలు ఇవే…
- పోలీసు, సీబీఐ, ఈడీ, కోర్టు పేరుతో వీడియో కాల్ చేసి డబ్బు అడిగితే అది మోసమే.
- ఎలాంటి విచారణకైనా అధికారులు వీడియో కాల్‌లో బ్యాంకు ఖాతాల్లోని డబ్బు బదిలీ చేయమని ఎప్పుడూ ఆదేశించరు.
- ఇలాంటి కాల్స్ వచ్చిన వెంటనే కాల్‌ను నిలిపివేసి 1930 సైబర్ హెల్ప్‌లైన్‌కు లేదా సమీప సైబర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.
- వెంటనే ఫిర్యాదు చేస్తే మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు సూచిస్తున్నారు.

