రామాయంపేట జూలై 5 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్) :
రామాయంపేట మండలం ధర్మారం గ్రామంలోని రెసిడెన్షియల్ హాస్టల్‌ను మండల తహసీల్దార్ రజిని కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వసతి గదులు, పరిశుభ్రత, విద్యార్థులకు అందిస్తున్న భోజన సౌకర్యాలు, తాగునీరు, ఇతర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు.

అనంతరం విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, వసతి, విద్యా సౌకర్యాలు, ఇతర సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలను మెరుగ్గా కల్పించాలని హాస్టల్ అధికారులను ఆదేశించారు.
హాస్టల్ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, పరిశుభ్రమైన వాతావరణం, పోషకాహారం, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

