గోరక్ష అభియాన్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు రెండు లక్షల సంతకాలతో వినతిపత్రం
సంగారెడ్డి, జూలై 27 (నవజ్యోతి న్యూస్):
గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోసంతతి పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని కోరుతూ గోరక్ష అభియాన్ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. హనుమాన్ మందిరం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు గోమాతతో పాటు భారీ ర్యాలీ నిర్వహించారు.
స్వామీజీల ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఒకే రోజు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గోరక్ష అభియాన్ నాయకులు తెలిపారు. జిల్లాలో ప్రజల నుంచి సేకరించిన సుమారు రెండు లక్షల సంతకాలను పీడీఎఫ్ రూపంలో జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.
ఈ సందర్భంగా అభియాన్ నాయకులు సుభాష్ చందర్, షెరీన్ సింగ్, సోహన్ లాల్ దహిమ, కౌన్సిలర్ జగన్, దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గోసంతతి పరిరక్షణ దేశ సంస్కృతి, వ్యవసాయానికి అత్యంత కీలకమని పేర్కొన్నారు. గోవును జాతీయ జంతువుగా ప్రకటించడంతో పాటు దేశవ్యాప్తంగా గోసంరక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గోశాలలకు ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి, గో ఆధారిత సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు.
తెలంగాణలో గోరక్షణకు సంబంధించిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోందని నాయకులు ఆరోపించారు. గోసంతతి సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుని చట్టాలను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ద్వారకా రవిప్రకాశ్‌జీ, రాఠోడ్ బద్రి మహారాజ్, పరమేష్, సునీల్, సాయి, సంతోష్‌తో పాటు గోభక్తులు, గోరక్ష అభియాన్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

