బండ్లు, ఊరేగింపులకు అనుమతి తప్పనిసరి..
తూప్రాన్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):
తూప్రాన్ పట్టణంలో రేపటి నుంచి జరగనున్న బోనాల ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టింది. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా, భక్తులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. తూప్రాన్ సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్‌ఐ గంగరాజుతో పాటు మున్సిపల్ సిబ్బంది ఉత్సవాల మార్గాలు, ప్రధాన కూడళ్లు, దేవాలయాల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ప్రజల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
బోనాల ఉత్సవాల సందర్భంగా డీజేలు, అధిక శబ్దంతో కూడిన సౌండ్ సిస్టమ్స్‌కు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఉత్సవాల్లో పలారం బండి నిర్వహించదలచిన నిర్వాహకులు ముందస్తుగా పోలీస్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. పోలీసుల అనుమతి లేకుండా పలారం బండ్లు నిర్వహించడం, ఊరేగింపులు చేపట్టడం చేయరాదని స్పష్టం చేశారు. అనుమతి పొందిన కార్యక్రమాలను సైతం పోలీసుల సూచనలు, నిబంధనలకు అనుగుణంగా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తెలిపారు.
బోనాల ఊరేగింపులు, ఇతర కార్యక్రమాల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు కోరారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా పోలీసుల సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని విజ్ఞప్తి చేశారు. బోనాల ఉత్సవాలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని తూప్రాన్ పోలీసులు కోరారు.

