సూసైడ్ నోట్, ఐఫోన్ కోసం దర్యాప్తు.. సాక్ష్యాలపై పోలీసుల దృష్టి.. రెండు రోజుల కస్టడీ అనంతరం జైలుకు తరలింపు
హైదరాబాద్, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి):
ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సహచర మహిళా ట్రైనీ చేసిన ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. స్టాకింగ్, లైంగిక వేధింపులు, దాడి, బెదిరింపులు, ప్రైవేట్ వీడియోను అనుమతి లేకుండా రికార్డు చేశారన్న ఆరోపణలు కేసులో ఉన్నాయి. రెండు రోజుల పోలీసు కస్టడీ అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించినట్లు తాజా సమాచారం. 0
కేసు నమోదైన అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డి ఆస్పత్రిలో చేరడం, ఆయన పేరుతో సూసైడ్ నోట్ వెలుగులోకి రావడంతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది. అయితే ఆ నోట్ అసలుదా, అందులో పేర్కొన్న వివరాలు ఎంతవరకు వాస్తవమన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.
సూసైడ్ నోట్లో కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు తన ఐఫోన్లో ఉన్నాయని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే నోట్, ఆ ఐఫోన్ ప్రస్తుతం పోలీసులకు అందుబాటులో లేకపోవడంతో వాటి ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగుతోంది. కస్టడీ విచారణలో నోట్ ఎక్కడ ఉందన్న విషయంపై ఉదయ్‌ను పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ కేసుపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉదయ్ కృష్ణారెడ్డిని సూసైడ్ నోట్, అదృశ్యమైన ఐఫోన్ తదితర అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం. కేసులో లభించే ఆధారాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
కేసులో మొబైల్ ఫోన్, ప్రైవేట్ వీడియోలు, చాటింగ్, ఇతర డిజిటల్ ఆధారాలు కీలకంగా మారాయి. ఉదయ్ తన వాదనకు ఫోన్లో ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ ఫోన్ లభిస్తే అందులోని డేటా, చాటింగ్, వీడియోలు, ఇతర సమాచారాన్ని ఫోరెన్సిక్‌గా పరిశీలించే అవకాశం ఉంది.
మహిళా ట్రైనీ తనపై వేధింపులు, దాడి, బెదిరింపులు, ప్రైవేట్ వీడియో రికార్డింగ్ వంటి ఆరోపణలు చేయగా.. ఉదయ్ కృష్ణారెడ్డి మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఇద్దరి మధ్య గతంలో వ్యక్తిగత సంబంధం ఉందని తన నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. ఇరువైపుల వాదనలను పోలీసులు ఆధారాల ఆధారంగా పరిశీలిస్తున్నారు.
ప్రస్తుతం కేసు దర్యాప్తులోనే ఉన్నందున ఆరోపణలు, ప్రత్యారోపణల్లో ఏది నిజమన్నది ఇప్పుడే తేల్చలేమని అధికారులు చెబుతున్నారు. సూసైడ్ నోట్, ఐఫోన్, డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీ, వాంగ్మూలాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే కేసులో పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

