సంగారెడ్డి, ఆగస్టు 11 (నవజ్యోతి వెబ్): తెలంగాణ సర్కిల్లో జరుగుతున్న పోస్టల్ డివిజనల్ నిర్మాణ సమీక్షపై వ్యక్తిగత జోక్యాన్ని కోరుతు మెదక్ ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన నలుగురు తెలంగాణ ఎంపీల బృందం కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్కి వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ పోస్టల్ సర్కిల్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వరంగల్ కేంద్రంగా కొత్త వరంగల్ రీజియన్ ఏర్పాటు చేయడంతో పాటు, కొత్తగూడెం, మంచిర్యాల, వికారాబాద్ పోస్టల్ డివిజన్లను ఏర్పాటు చేసి, వాటి మాతృ డివిజన్లను విభజించాలని కోరుతూ కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి తెలంగాణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గోడం నగేష్ తో కలిసి మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పోస్టల్ ప్రధాన డిమాండ్లు సమస్యలను వివరించారు.దీనిలో భాగంగా నల్గొండ సూర్యాపేట డివిజన్ల విలీనం, సంగారెడ్డి డివిజన్ ను జేటీఎస్ కేడర్ కు అప్ గ్రేడ్ చేసి, దాని ప్రధాన కార్యాలయాన్ని సంగారెడ్డి నుండి పటాన్ చేరు కు మార్చాలన్న చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ ప్రతిపాదన సమంజసం కాదు. సంగారెడ్డి వర్క్లోడ్ (2.1) ఇప్పటికే విభజనను సమర్థిస్తోందే తప్ప, ప్రధాన కార్యాలయ మార్పును కాదు. సికింద్రాబాద్ వర్క్లోడ్ (3.7) రెండు కొత్త డివిజన్ల ఏర్పాటును సమర్థిస్తుండగా, సర్కిల్ బదులుగా తాండూరు, వికారాబాద్లను సంగారెడ్డికి జోడించాలని ప్రతిపాదిస్తోంది. ఇది భారాన్ని తగ్గించడం కాక కేవలం బదిలీ చేయడమే. జిల్లా కేంద్రం నుండి ప్రధాన కార్యాలయాన్ని తరలించడానికి ఎలాంటి కార్యాచరణ సమర్థన లేదు. పోస్టల్ శాఖ స్వంత వర్క్లోడ్ నిబంధనల (ఎస్ ఐ యూ ప్రమాణం 0.9) ఆధారంగా కింది ప్రతిపాదనలను ఈ సమీక్షలో చేర్చాలని కోరుతున్నారు.ఖమ్మం డివిజన్ విభజన — కొత్తగూడెం డివిజన్ ఏర్పాటు: ఖమ్మం డివిజన్ (వర్క్లోడ్ 2.74, పోస్టాఫీసులు (818), సబ్-డివిజన్లు 10) సర్కిల్లోనే అతిపెద్దది. కొత్తగూడెం, ఏలేశ్వరం, మనుగూరు, పాల్వంచ, భద్రాచలం నార్త్ సబ్-డివిజన్లతో కొత్తగూడెం డివిజన్ ను ఏర్పాటు చేయాలి.ఆదిలాబాద్ డివిజన్ విభజన — మంచిర్యాల డివిజన్ ఏర్పాటు: ఆదిలాబాద్ డివిజన్ (వర్క్లోడ్ 2.21, నాలుగు జిల్లాల విస్తీర్ణం) విస్తారమైనది. మంచిర్యాల, కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలతో మంచిర్యాల డివిజన్ను ఏర్పాటు చేయాలి; ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాలు ఆదిలాబాద్ హెడ్ పోస్టాఫీసు పరిధిలో కొనసాగాలి.సికింద్రాబాద్ డివిజన్ విభజన — వికారాబాద్ డివిజన్ ఏర్పాటు: సర్కిల్లో అత్యధిక వర్క్లోడ్ (3.70) కలిగిన సికింద్రాబాద్ డివిజన్ నుండి వికారాబాద్, తాండూరు, పరిసర సబ్-డివిజన్లతో వికారాబాద్ డివిజన్ను ఏర్పాటు చేయాలి. వరంగల్లో నూతన పోస్టల్ రీజియన్: 3.99 కోట్ల జనాభాకు తెలంగాణ సర్కిల్లో కేవలం 2 రీజియన్లు, 16 డివిజన్లు మాత్రమే ఉన్నాయి — కేరళ (3 రీజియన్లు/24 డివిజన్లు/3.53 కోట్లు), ఒడిశా (3 రీజియన్లు/22 డివిజన్లు/4.69 కోట్లు) కంటే తక్కువ. అవశేష ఆంధ్రప్రదేశ్కు 4వ రీజియన్ లభించనుండగా, ఉమ్మడి ఏపీ జనాభాలో 42% వాటా కలిగిన తెలంగాణకు, రాష్ట్రంలో రెండో అతిపెద్ద పట్టణ కేంద్రమైన వరంగల్ ప్రధాన కేంద్రంగా 3వ రీజియన్ న్యాయబద్ధం. ఇందులో వరంగల్, హనుమకొండ, ఖమ్మం, కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల డివిజన్లు గా ఉంటే ప్రజలకు తపాలా మెరుగైన సేవలు అందుతాయి .

