ఆర్ జి కె కాలనీ రహదారి గుంతలను పూడ్చిన ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నామడి రాజా
కీసర,ఆగస్టు 2, (నవజ్యోతి ప్రతినిధి) :
కీసర సర్కిల్ దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీ వెల్లే ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతల కారణంగా నిత్యం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో పాటు ప్రమాదాలు చోటుచేసుకునే పరిస్థితి నెలకొంది.ఈ సమస్యను గుర్తించిన దమ్మాయిగూడ మున్సిపల్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నామడి రాజా తన సహచరులతో కలిసి స్వచ్ఛందంగా రహదారిపై ఉన్న గుంతలను మట్టితో పూడ్చి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు.
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన గుంతలను అధికారులు శాశ్వతంగా పూడ్చే వరకు వేచి చూడకుండా, సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం స్థానికుల ప్రశంసలను అందుకుంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, వృద్ధులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ చర్య చేపట్టినట్లు నామడి రాజా తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని, వర్షాకాలంలో రహదారులపై ఏర్పడిన గుంతలను వెంటనే శాశ్వతంగా మరమ్మతు చేయాలని సంబంధిత మున్సిపల్ అధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులను కోరారు. అభివృద్ధి పనుల్లో అధికారులు మరింత చురుకుగా వ్యవహరించి ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గంజి ఈశ్వర్,గౌరక ప్రభాకర్ పాల్గొని తమ వంతు సహకారం అందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన నామడి రాజా సేవాభావాన్ని స్థానికులు అభినందిస్తూ, రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

