వైకల్యం కాదు.. సామర్థ్యమే అర్హతకు ప్రాతిపదిక.. ‘డిజెబిలిటీ సర్టిఫికేట్’ స్థానంలో ‘ఎలిజిబిలిటీ సర్టిఫికేట్’
న్యూఢిల్లీ, ఆగస్టు 2 (నవజ్యోతి ప్రతినిధి):
ఎంబీబీఎస్ కోర్సుల్లో దివ్యాంగుల (PwBD) ప్రవేశాల ప్రక్రియలో జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) కీలక మార్పులు చేసింది. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నుంచి అమల్లోకి వచ్చే కొత్త మార్గదర్శకాల ప్రకారం, ఇకపై అభ్యర్థుల అర్హతను వారి వైకల్యం శాతం ఆధారంగా కాకుండా, వైద్య విద్యను పూర్తిచేసే క్రియాత్మక సామర్థ్యం (Functional Ability) ఆధారంగా నిర్ణయించనుంది.
కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటివరకు జారీ చేస్తున్న ‘డిజెబిలిటీ సర్టిఫికేట్’ స్థానంలో ‘ఎలిజిబిలిటీ సర్టిఫికేట్’ను జారీ చేయనున్నారు. ప్రత్యేక వైద్య నిపుణులతో కూడిన బోర్డులు ప్రతి అభ్యర్థిని వ్యక్తిగతంగా పరీక్షించి, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తే ఎంబీబీఎస్ కోర్సును విజయవంతంగా పూర్తి చేయగలరా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటాయి.
కేవలం వైకల్యం శాతం లేదా వైకల్యం రకాన్ని ఆధారంగా చేసుకుని అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించకూడదని ఎన్‌ఎంసీ స్పష్టం చేసింది. దివ్యాంగుల సామర్థ్యాన్ని, అవసరమైన సహాయక సదుపాయాలను పరిగణనలోకి తీసుకుని అర్హతను నిర్ణయించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
అదేవిధంగా దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో దివ్యాంగ విద్యార్థులకు విద్యా, క్లినికల్, పరిపాలనా పరమైన సహకారం అందించేందుకు ప్రత్యేకంగా ‘ఎనేబ్లింగ్ యూనిట్లు’ ఏర్పాటు చేయాలని ఎన్‌ఎంసీ ఆదేశించింది. ఈ యూనిట్లు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, మార్గదర్శకత్వం, మద్దతు అందించే బాధ్యతను నిర్వహించనున్నాయి.
దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వైద్య విద్యలో సమ్మిళిత (Inclusive) విధానాన్ని బలోపేతం చేయడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని ఎన్‌ఎంసీ వెల్లడించింది.

