కుత్బుల్లాపూర్, ఆగస్టు 1: (నవజ్యోతి ప్రతినిధి)
నేరాల నియంత్రణ, ప్రజల భద్రతతో పాటు పరిశుభ్రమైన కార్యాలయ వాతావరణం కూడా ప్రజా విశ్వాసాన్ని పెంచుతుందనే సందేశంతో
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో శనివారం ప్రత్యేక స్వచ్ఛత కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎన్. సురేష్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కలిసి స్టేషన్లోని అన్ని గదులు, క్యాబిన్లు, రికార్డు విభాగాలు, ఆవరణను పూర్తిగా శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే కార్యాలయాలు కూడా పరిశుభ్రంగా ఉండాలని, పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్హెచ్వో ఎన్. సురేష్ తెలిపారు.
విధుల నిర్వహణతో పాటు సామాజిక బాధ్యతలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు కూడా తమ ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

