-
లెక్చరర్ అవమానించారని సూసైడ్ నోట్‌లో ఆరోపణ.. విద్యార్థుల పట్ల సున్నితంగా వ్యవహరించాలనే చర్చ
గద్వాల, జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి):
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ (17) సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
తరుణ్ ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల్లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లాలో రెండో స్థానం దక్కించుకున్నాడు. అయితే తనకంటే ఒక మార్కు ఎక్కువ సాధించిన విద్యార్థితో పోల్చుతూ ఓ మహిళా లెక్చరర్ తనను పదేపదే కించపరిచారని, తాను అలా చేయొద్దని కోరగా “నువ్వేమైనా మంత్రి కొడుకువా.. అంత గొప్పోడివా” అంటూ చెంపపై కొట్టారని తరుణ్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు తెలిసింది.
తరగతి గదిలో జరిగిన ఈ ఘటనతో సహ విద్యార్థులు నవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించే విధంగా ఉండాలే గానీ అవమానించకూడదని, తనలాంటి సున్నిత మనస్తత్వం ఉన్న విద్యార్థులకు అలాంటి అవమానం ఎంత బాధ కలిగిస్తుందో అర్థం చేసుకోవాలని సూసైడ్ నోట్‌లో రాసినట్లు సమాచారం. తన మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయం ప్రజలకు తెలియాలని కూడా నోట్‌లో కోరినట్లు తెలుస్తోంది.
మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తరుణ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన మరోసారి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేసేలా చేసింది. యుక్తవయసులో ఉన్న విద్యార్థులు చిన్నచిన్న మాటలను కూడా తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇతరులతో పోల్చడం, బహిరంగంగా అవమానించడం వంటి వాటికి దూరంగా ఉండి, వారి సమస్యలను ఓపికగా విని, ధైర్యం చెప్పి, ప్రోత్సహించే వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. మార్కులు మాత్రమే జీవితాన్ని నిర్ణయించవని, ప్రతి విద్యార్థి ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత కుటుంబంతో పాటు విద్యాసంస్థలపై కూడా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
గమనిక: ఈ వార్తలో లెక్చరర్‌కు సంబంధించిన అంశాలు విద్యార్థి సూసైడ్ నోట్‌లో పేర్కొన్న ఆరోపణలు మరియు ప్రాథమిక సమాచారం ఆధారంగా మాత్రమే ఉన్నాయి. ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

