– అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నిర్ణయం
– టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి వెల్లడి
సంగారెడ్డి, జూలై 23 (నవజ్యోతి ప్రతినిధి):
రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పనిచేస్తున్న జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పాత బస్ పాస్‌ల చెల్లుబాటు గడువును ఆగస్టు 3 వరకు పొడిగించినట్లు టియుడబ్ల్యూజే (ఐజేయు) సంగారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షుడు బండారు యాదగిరి తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ, 2026–2028 సంవత్సరాలకు సంబంధించిన అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ వివిధ దశల్లో కొనసాగుతోందని, అర్హులైన జర్నలిస్టులకు కార్డులు అందజేసే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల మేరకు అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు గడువును వచ్చే నెల ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి పాత్రికేయుల పాత బస్ పాస్‌ల చెల్లుబాటును కూడా జూలై 23 నుంచి ఆగస్టు 3, 2026 వరకు (12 రోజులు) పొడిగించినట్లు తెలిపారు.
ఈ మేరకు జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారితో పాటు ఆర్టీసీ అధికారులకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయంతో జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్ పాస్‌లను వినియోగించుకునే అవకాశం కల్పించారని బండారు యాదగిరి పేర్కొన్నారు.

