దేవునిపల్లి పాఠశాలలో ‘క్యాచ్ ది రెయిన్’ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి పిలుపు
కామారెడ్డి, జూలై 21 (నవజ్యోతి ప్రతినిధి): మానవ మనుగడకు నీరే జీవాధారమని, వర్షించే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించుకోవాలని కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘క్యాచ్ ది రెయిన్’ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
పడే ప్రతి వర్షపు బొట్టును వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు నీటి విలువ బాగా తెలుసని, ఒక్క వర్షపు చుక్క కోసం వారు ఎంతగానో ఎదురుచూస్తారని అన్నారు. విద్యార్థులు నీటిని పొదుపుగా వినియోగించడంతో పాటు ఇంట్లోనూ నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని సూచించారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, కమిషనర్ పర్వతాలు, డీఈ హన్మంత్ రావు, టీపీఓ వినీత్, ప్రధానోపాధ్యాయుడు గంగాకిషన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

