- దామరచర్ల సీపీఐ కార్యదర్శి పోలేపల్లి ఉదయ్‌కుమార్
దామరచర్ల, జూలై 19 (నవజ్యోతి ప్రతినిధి) ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, పేద ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఆదుకోవాలని సీపీఐ దామరచర్ల కార్యదర్శి పోలేపల్లి ఉదయ్ కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం దామరచర్ల కేంద్రంలో నిర్వహించిన సీపీఐ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయలేకపోతిన్న కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తుల నిధుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు తక్షణ ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకురావాలనే ప్రయత్నాలను విరమించుకుని రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని, ప్రజాధనాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు అనుకూలంగా వినియోగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ఏడాది పంటల దిగుబడులు తగ్గే సూచనలు ఉన్నందున రైతులు, కౌలు రైతులు, కార్మికులు, పేద ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ సహాయ కార్యదర్శి ధనావత్ శాంత, గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ధీరావత్ లింగ నాయక్, సీపీఐ సీనియర్ నాయకులు గజ్జల లక్ష్మీ నరసింహారెడ్డి, జమ్ముల కోటయ్య, శుద్ధబోయిన రాములు, భాగం శేషయ్య, చక్రి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

