ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స.
అండర్‌పాస్ నిర్మాణంలో నిర్లక్ష్యమే ప్రమాదాలకు కారణమంటున్న ప్రజలు
ప్రమాదాల పంజాలో ఆద్య గ్రాండ్ వై జంక్షన్.. అండర్‌పాస్ ఎప్పుడంటూ ప్రజల ప్రశ్న
నిత్యం ప్రమాదాలు.. పట్టించుకోని అధికారులు.. భయంతో ప్రయాణికులు
రామాయంపేట ఎన్‌హెచ్-44 వై జంక్షన్.. ప్రమాదాల హాట్‌స్పాట్‌గా మారిందా?
రామాయంపేట జూలై 6 ( నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్ ) : మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఎన్‌హెచ్-44 జాతీయ రహదారిపై ఆద్య గ్రాండ్ సమీపంలోని వై జంక్షన్ మరోసారి రక్తసిక్తమైంది.ఒకే రోజు వేర్వేరు సమయాల్లో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడటం తో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఉదయం జరిగిన మొదటి ప్రమాదంలో అక్కన్నపేట గ్రామానికి చెందిన బక్కయ్యగారి సిద్ధిరాములు తీవ్రంగా గాయపడి రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో చికిత్స పొందుతున్నారు.అనంతరం ఉదయం సుమారు 11 గంటల సమయంలో అదే ప్రాంతంలో జరిగిన మరో ప్రమాదంలో నాజర్ అనే ఎలక్ట్రిషియన్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో మేడ్చల్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.స్థానికుల కథనం ప్రకారం, ఆద్య గ్రాండ్ వై జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ,శాశ్వత పరిష్కారమైన అండర్‌పాస్ లేదా సురక్షిత జంక్షన్ నిర్మాణంపై సంబంధిత అధికారులు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం, రామాయంపేట వైపు మలుపు ప్రమాదకరంగా ఉండటం వల్ల ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని వారు చెబుతున్నారు.ఈ జంక్షన్‌ను ఇప్పటికే ” యాక్సిడెంట్ హాట్‌స్పాట్ ” గా గుర్తించాలని, వెంటనే అండర్‌పాస్ నిర్మాణం చేపట్టడంతో పాటు హెచ్చరిక బోర్డులు,హైమాస్ట్ లైట్లు, స్పీడ్ నియంత్రణ చర్యలు, ట్రాఫిక్ భద్రతా ఏర్పాట్లు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.మరో ప్రాణం బలి కాకముందే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మరియు జాతీయ రహదారుల అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలో అనేక ప్రమాదాలు జరిగినప్పటికీ తగిన చర్యలు లేకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

