ఉమ్మడి రంగారెడ్డి/ మొయినాబాద్, జూలై 05,(నవజ్యోతి ప్రతినిధి శివారెడ్డి) :
- రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని నక్కలపల్లి గ్రామపంచాయతీలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు సహాయక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మంగళారం యాదయ్య, ఉపసర్పంచ్ నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి అర్హత కలిగిన ఓటరు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు తమ దరఖాస్తులను సక్రమంగా సమర్పించుకునేలా ఈ సహాయక కేంద్రం ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఓటరు నమోదు, పేరు సవరణ, చిరునామా మార్పు, పేరు తొలగింపు, ఇతర వివరాల సవరణతో పాటు గణన పత్రాలను నింపడంలో గ్రామ ప్రజలకు పూర్తిగా ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, నిరక్షరాస్యులు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా వారికి అవసరమైన సహాయాన్ని అందించి, బూత్ స్థాయి అధికారులకు (బీఎల్‌ఓలు), ఓటర్లకు మధ్య కాంగ్రెస్ పార్టీ వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా సరిచేసుకుని ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా ఈ ప్రత్యేక సహాయక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మంగళారం యాదయ్య, ఉపసర్పంచ్ నిరంజన్ గౌడ్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరి రవి, బూత్ ఏజెంట్ సమీర్, కాంగ్రెస్ నాయకులు నవీన్, శ్రీకాంత్, భాను, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

