చౌటకూర్, ఆగస్టు 20 (నవజ్యోతి ప్రతినిధి) :
చౌటకూర్ మండలంలోని కోర్పోల్ గ్రామం నుంచి సుల్తాన్పూర్ వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు గురువారం శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో హెచ్ఎండిఏ నిధుల నుంచి రూ.4 కోట్లు మంజూరైనట్లు స్థానిక కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి దామోదర రాజనర్సింహ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కోర్పోల్ నుంచి సుల్తాన్పూర్ వరకు రహదారి నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయని నాయకులు పేర్కొన్నారు. ప్రస్తుతం రహదారి సౌకర్యం సరిగా లేక ప్రజలు, రైతులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బీటీ రోడ్డు నిర్మాణంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే కోర్పోల్, సుల్తాన్పూర్ గ్రామాల మధ్య రవాణా అనుసంధానం బలపడటంతో పాటు, సమీప గ్రామాలకు వెళ్లే ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు తరలించేందుకు రైతులకు సౌకర్యంగా ఉంటుందని, అత్యవసర సమయాల్లో వైద్య సేవలు పొందేందుకు రవాణా సదుపాయం మెరుగుపడుతుందని నాయకులు వివరించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కాంగ్రెస్ నాయకులు ప్రశంసించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో మంత్రి చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న బీటీ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి, పనులకు శ్రీకారం చుట్టినందుకు గ్రామస్థులు, మండల నాయకులు మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా నాయకులు సంబంధిత అధికారులను కోరారు. నిర్మాణ పనుల సమయంలో గ్రామస్థులు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నత్తి దశరత్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్, కోర్పోల్ గ్రామ అధ్యక్షుడు సంజయ్ కుమార్, మైపాల్ రెడ్డి, లింగా రెడ్డి, మహేష్ రెడ్డి, చల్ల రాములు, బల్లయ్య శంకర్, మైపాల్, భారత్ రెడ్డి, శ్రీను, మన్నే సుధాకర్, కిషన్, రమేష్, సుధానయ్య తదితరులు పాల్గొన్నారు.

