📄 ePaper
Friday, August 21, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హైదరాబాద్‌లో షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు!

హైదరాబాద్‌లో షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు!

ఐఎస్ఐ లింకులపై దర్యాప్తు ముమ్మరం.. మేడ్చల్‌లో పనిచేసిన యువకుడి డిజిటల్‌ సంబంధాలపై ఆరా.. దేశవ్యాప్తంగా 253 మంది అదుపులో

హైదరాబాద్, ఆగస్టు 21 (నవజ్యోతి ప్రతినిధి):

పాకిస్థాన్‌కు చెందిన షహజాద్ భట్టి నెట్‌వర్క్‌ (ఎస్‌బీఎన్‌), ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌ లింకులు ఇప్పుడు కీలకంగా మారాయి.
దేశవ్యాప్తంగా ఈ నెట్‌వర్క్‌పై భద్రతా సంస్థలు చర్యలు చేపడుతున్న సమయంలో.. మేడ్చల్‌లో కొంతకాలం పనిచేసిన గాజియాబాద్‌కు చెందిన
22 ఏళ్ల జాయిద్‌ ఖాన్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అతడి సోషల్‌ మీడియా పరిచయాలు, డిజిటల్‌ కమ్యూనికేషన్‌, నగరంలో అతడి కదలికలపై అధికారులు దృష్టి సారించారు.

మేడ్చల్‌లో ఉద్యోగం.. సోషల్‌ మీడియాలో పరిచయాలు

గాజియాబాద్‌కు చెందిన జాయిద్‌ ఖాన్‌ 2026 ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చినట్లు దర్యాప్తు వివరాలు చెబుతున్నాయి.
మేడ్చల్‌లోని ఓ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న సమయంలో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పాకిస్థాన్‌కు చెందిన షహజాద్‌ భట్టితో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అనంతరం ఇతర అనుమానితులతోనూ ఆన్‌లైన్‌ పరిచయాలు కొనసాగించినట్లు గుర్తించారు.

అతడి ఫోన్‌ను పరిశీలించగా ఇన్‌స్టాగ్రామ్‌ సందేశాలు, వాట్సాప్‌ చాట్స్‌, వాయిస్‌ కాల్స్‌, స్క్రీన్‌షాట్లు లభించినట్లు పోలీసులు తెలిపారు.
ఆయుధాలపై ఆసక్తి చూపినట్లు, పిస్టల్‌ సంపాదించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడంతో అతడి కార్యకలాపాలపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.

రీల్స్‌ నుంచి పాక్‌ లింకుల వరకు

ఈ కేసులో ప్రధానంగా బయటపడుతున్న అంశం సోషల్‌ మీడియా వినియోగం.
ప్రత్యక్షంగా పరిచయం లేని వ్యక్తులతో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం పెంచుకోవడం.. చాటింగ్‌, వాయిస్‌ కాల్స్‌ ద్వారా సంబంధాలు కొనసాగించడం..
ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు, ఇతర సమాచారం గురించి ఆరా తీయడం వంటి అంశాలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి.

జాయిద్‌కు పాక్‌ అనుకూల నెట్‌వర్క్‌తో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న
అబిద్‌ జాట్‌, రాణా హుస్సేన్‌ వంటి వ్యక్తులతో పరిచయాలు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం.
అయితే ఈ సంబంధాల అసలు ఉద్దేశం ఏమిటి? అవి కేవలం ఆన్‌లైన్‌ పరిచయాలకే పరిమితమా?
లేక నెట్‌వర్క్‌ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

దేశవ్యాప్తంగా విస్తరించిన నెట్‌వర్క్‌

ఈ వ్యవహారాన్ని కేవలం హైదరాబాద్‌కు పరిమితమైన కేసుగా చూడలేని పరిస్థితి కనిపిస్తోంది.
ఆగస్టు 12న 14 రాష్ట్రాల్లో భద్రతా సంస్థలు చేపట్టిన సమన్వయ ఆపరేషన్‌లో
253 మందిని అదుపులోకి తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.
దేశవ్యాప్తంగా 80కిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదవగా.. 200కుపైగా అరెస్టులు జరిగినట్లు అధికారిక వివరాలు చెబుతున్నాయి.
తెలంగాణ నుంచి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది.

ఉత్తరప్రదేశ్‌, హర్యానా, ఢిల్లీ, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకోవడం
ఈ నెట్‌వర్క్‌ విస్తృతిని సూచిస్తోంది.

ఆయుధాలు.. నిఘా.. రెక్కీ

దర్యాప్తులో ఐఈడీలు, పిస్టళ్లు, బుల్లెట్లు, పాకిస్థాన్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ గుర్తులున్న గ్రెనేడ్లు,
నిఘా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాలు
స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పోలీస్‌, రక్షణ సంస్థలు, మతపరమైన ప్రాంతాలపై రెక్కీ నిర్వహించడం, నిఘా సమాచారం సేకరించడం వంటి కార్యకలాపాలకు
స్థానిక వ్యక్తులను ఉపయోగించినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్‌లోని అనుమానితుల డిజిటల్‌ కమ్యూనికేషన్‌ ఇప్పుడు కీలక ఆధారంగా మారుతోంది.
ఎవరెవరితో మాట్లాడారు? ఎలాంటి సమాచారాన్ని పంచుకున్నారు? ఆర్థిక లావాదేవీలు జరిగాయా?
నగరంలో మరెవరితో సంబంధాలు ఏర్పడ్డాయి? అన్న అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

హైదరాబాద్‌ లింక్‌పై ఉత్కంఠ

మేడ్చల్‌లో పనిచేసిన జాయిద్‌ ఖాన్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో హైదరాబాద్‌లో ఈ నెట్‌వర్క్‌ కదలికలు ఎంతవరకు విస్తరించాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
అయితే ఒక వ్యక్తి విదేశీ వ్యక్తితో సోషల్‌ మీడియాలో మాట్లాడటం మాత్రమే ఉగ్ర కార్యకలాపాలకు నిర్ధారణగా భావించలేం.
అందుకే డిజిటల్‌ ఆధారాలు, కమ్యూనికేషన్‌, ఆర్థిక లావాదేవీలు, ఆయుధాల సంబంధాలు, ఇతర వ్యక్తులతో ఉన్న పరిచయాలను
సమగ్రంగా విశ్లేషించిన తర్వాతే అసలు విషయం తేలనుంది.


దేశం వెలుపల నుంచి సాగినట్లు అనుమానిస్తున్న నెట్‌వర్క్‌.. సోషల్‌ మీడియా ద్వారా హైదరాబాద్‌ వరకు చేరిందా?
నగరంలో ఇంకా బయటపడని లింకులు ఉన్నాయా?

ఈ రెండు ప్రశ్నలకు సమాధానమే ఇప్పుడు దర్యాప్తులో కీలకం.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!