📄 ePaper
Friday, August 21, 2026
📄 ePaper
HomeHealth & Fitnessప్రపంచ మలేరియా దినోత్సవం :దోమ చిన్నదే.. కానీ ముప్పు పెద్దది !

ప్రపంచ మలేరియా దినోత్సవం :దోమ చిన్నదే.. కానీ ముప్పు పెద్దది !

చిన్నదే.. కానీ ప్రాణాంతకమే
మలేరియా, డెంగీకి దోమలే వాహకాలు
నీరు నిల్వ లేకుండా చూస్తే వ్యాధులకు చెక్‌

హైదరాబాద్‌, ఆగస్టు 20 (నవజ్యోతి ప్రత్యేక కథనం):

చిన్న కీటకమే.. కానీ మనిషి ప్రాణాలపై పెద్ద ప్రభావం చూపుతుంది. దోమల ద్వారా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. దోమల నియంత్రణ, మలేరియాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవం నిర్వహిస్తున్నారు.

భారత్‌తో ముడిపడిన చరిత్ర

ప్రపంచ దోమల దినోత్సవానికి భారత్‌తో ప్రత్యేక సంబంధం ఉంది. 1897లో భారతదేశంలో పరిశోధనలు చేసిన వైద్య శాస్త్రవేత్త సర్‌ రోనాల్డ్‌ రాస్‌ దోమల ద్వారా మలేరియా వ్యాప్తి చెందుతుందని నిర్ధారించారు. ఈ ఆవిష్కరణ మలేరియా నియంత్రణలో కీలక మలుపుగా మారింది. ఆయన పరిశోధనకు గుర్తుగా ఆగస్టు 20న ప్రపంచ దోమల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

మలేరియా లక్షణాలపై అప్రమత్తత

సోకిన ఆడ అనోఫిలిస్‌ దోమ కుట్టడం ద్వారా మలేరియా వ్యాపిస్తుంది. జ్వరం, చలి, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చు. జ్వరం వచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే మలేరియా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది.

నీరు నిలిస్తే.. దోమల పుట్టగొడుగే!

ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడటం దోమల నియంత్రణలో అత్యంత కీలకం. కూలర్లు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు, కొబ్బరి చిప్పలు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ట్యాంకులు, డ్రమ్ములను మూతలతో కప్పి ఉంచాలి. పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలి.

వర్షాకాలంలో మరింత జాగ్రత్త

వర్షాలు కురిసిన తర్వాత చిన్నచిన్న నీటి గుంటలు ఏర్పడటం దోమల వృద్ధికి అనుకూలంగా మారుతుంది. దీంతో వర్షాకాలంలో దోమల నియంత్రణపై మరింత దృష్టి పెట్టాలి. దోమతెరలు వినియోగించడం, అవసరమైన చోట దోమల నివారణ మందులు ఉపయోగించడం, ఇళ్లలోకి దోమలు రాకుండా కిటికీలకు జల్లెడలు ఏర్పాటు చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

ప్రజల భాగస్వామ్యమే కీలకం

దోమల నియంత్రణ ఒక్క ప్రభుత్వ శాఖ బాధ్యత మాత్రమే కాదు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత. దోమ పుట్టే ప్రదేశాలను ముందుగానే తొలగిస్తే.. దోమల ద్వారా వచ్చే వ్యాధులకు అడ్డుకట్ట వేయొచ్చు. ప్రపంచ దోమల దినోత్సవ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!