స్వాతంత్ర్య దినోత్సవం వేళ హైదరాబాద్ పారిశుధ్య కార్మికుల విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి): స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను గౌరవంగా ఎగురవేసి.. అనంతరం రోడ్లపై, డ్రైనేజీల్లో, చెత్తకుండీల్లో పడేయొద్దని హైదరాబాద్ పారిశుధ్య కార్మికులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ జెండా పట్ల గౌరవాన్ని చాటేలా ప్లకార్డులతో అవగాహన కల్పించారు.
వేడుకల తర్వాత జెండాల పరిస్థితి
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం నగరంలోని రోడ్లు, బహిరంగ ప్రదేశాలు, చెత్తకుప్పల్లో పడేసిన కాగితం, ప్లాస్టిక్ జాతీయ జెండాలను సేకరించాల్సిన పరిస్థితి పారిశుధ్య కార్మికులకు ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో జెండాలను నిర్లక్ష్యంగా పడేయకుండా గౌరవంగా సేకరించి, భద్రపరిచి, భారత జెండా నియమావళి (Flag Code of India) ప్రకారం గౌరవప్రదంగా తొలగించాలని వారు కోరారు.
దేశభక్తి అంటే గౌరవం కాపాడటమే
PR CommUNITY ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం.. వేడుకలు ముగిసిన తర్వాత జాతీయ జెండాల పరిస్థితిపై ప్రజల దృష్టిని మళ్లించింది. దేశభక్తి అంటే జెండాను ఎగురవేయడమే కాకుండా.. వేడుకలు ముగిసిన తర్వాత కూడా దాని గౌరవాన్ని కాపాడటమేనని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు.
‘ఫ్లాగ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్’ హాజరు
ఈ కార్యక్రమానికి ‘ఫ్లాగ్ మ్యాన్ ఆఫ్ బెంగాల్’గా పేరొందిన ప్రియ రంజన్ సర్కార్ రాక మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 15 ఏళ్లకు పైగా ఆయన బహిరంగ ప్రదేశాల్లో నిర్లక్ష్యంగా పడేసిన జాతీయ జెండాలను సేకరిస్తూ, త్రివర్ణ పతాకాన్ని గౌరవంగా చూడాలనే అవగాహన కల్పిస్తున్నారు.
నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికులే జాతీయ జెండాలను చెత్తలో పడేయొద్దని కోరడం.. స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అంశంగా నిలిచింది.

