📄 ePaper
Thursday, August 13, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆసిడ్‌ దాడి బాధితులకు రైలు ప్రయాణ రాయితీ !

ఆసిడ్‌ దాడి బాధితులకు రైలు ప్రయాణ రాయితీ !

సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం.. ఆరు వారాల్లో విధానం రూపొందించాలి

న్యూఢిల్లీ, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
ఆసిడ్‌ దాడి బాధితులకు రైలు ప్రయాణ రాయితీ కల్పించే విధానాన్ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం
సూత్రప్రాయంగా అంగీకరించింది. వైద్య చికిత్స కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సి
వచ్చే బాధితులకు ఈ సౌకర్యం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

సుప్రీంకోర్టులో విచారణ

ఆసిడ్‌ దాడి బాధితులకు రైల్వే రాయితీతో పాటు రిజర్వేషన్‌ ప్రయోజనాలు కల్పించాలని కోరుతూ
అతిజీవన్‌ సొసైటీ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌,
జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

‘పేషెంట్‌ కేటగిరీ’లో రాయితీ

ప్రస్తుతం ఉన్న ‘పేషెంట్‌ కేటగిరీ’ కిందనే ఆసిడ్‌ దాడి బాధితులకు రైల్వే
రాయితీ కల్పించాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నట్లు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఆర్చన పాఠక్‌ డేవ్‌
కోర్టుకు తెలిపారు. ప్రత్యేకంగా వికలాంగుల కేటగిరీలో రాయితీ కల్పిస్తే ఇతర కేటగిరీల నుంచి
కూడా ఇలాంటి డిమాండ్లు వచ్చే అవకాశం ఉందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే వైద్య చికిత్స కోసం ఆసిడ్‌ దాడి బాధితులకు ప్రయాణం తప్పనిసరి కావడంతో రాయితీ
కల్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

వివిధ రాష్ట్రాల్లో చికిత్స పొందాల్సిన బాధితులకు ప్రస్తుత విధానంతో ఇబ్బందులు ఎదురవుతాయని
పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఒకే బాధితుడికి కళ్ల చికిత్స, చర్మ మార్పిడి వంటి పలు శస్త్రచికిత్సలు వేర్వేరు ప్రాంతాల్లో
అవసరం కావచ్చని తెలిపారు. దీనిపై సీజేఐ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. రాయితీని ఒక నిర్దిష్ట
కాలానికి అందించే విధానాన్ని పరిశీలించాలని సూచించారు.

అత్యవసర కోటాపైనా సానుకూలత

చికిత్స అవసరాన్ని బట్టి ఆసిడ్‌ దాడి బాధితులు అత్యవసరంగా ప్రయాణించాల్సి ఉంటుందని,
వారికి రైల్వే అత్యవసర కోటాలో కూడా సౌకర్యం కల్పించాలని పిటిషనర్‌ తరఫు
న్యాయవాది కోరారు. దీనిపై సీజేఐ సానుకూలంగా స్పందిస్తూ అలాంటి ఏర్పాటును కూడా విధానంలో
చేర్చాలని సూచించారు.

ఆరు వారాల గడువు:
కోర్టు సూచనలకు అనుగుణంగా విధానంలోని నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్రానికి
ఆరు వారాల సమయం ఇచ్చింది.

ప్రతిపాదిత విధానాన్ని కోర్టులో దాఖలు చేయడానికి ముందు అతిజీవన్‌ సొసైటీకి అందజేసి,
వారి సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం అంగీకరించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!