📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలి !

గోదావరి జలాలను గరిష్టంగా వినియోగించుకోవాలి !

ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ నుంచి సాధ్యమైనంత మేర ఎత్తిపోతలు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు

హైదరాబాద్‌, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): గోదావరి జలాలను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్లంపల్లితో పాటు దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేర నీటిని ఎత్తిపోసి వినియోగించుకోవాలని సూచించారు. నీటిపారుదల శాఖపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

తొమ్మిది పంపులతో దేవాదుల ఎత్తిపోతలు

దేవాదుల నుంచి గతంలో ఎన్నడూ లేనివిధంగా తొమ్మిది పంపులతో ఎత్తిపోతలు చేపట్టామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశంలో వివరించారు. దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ఎత్తిపోతలకు సంబంధించి చిన్నచిన్న సమస్యలు ఉంటే వాటి పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పెండింగ్‌ పరిహారం వెంటనే చెల్లించాలి

పలు ప్రాజెక్టుల కింద ఒకట్రెండు గ్రామాలు, కొద్దిపాటి వ్యవసాయ భూములకు పరిహారం చెల్లింపు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. వాటిని వెంటనే చెల్లించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు. నీటిపారుదల, రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ముంపు గ్రామాలు, పరిహారం, పునరావాసానికి సంబంధించి వాస్తవ నివేదిక రూపొందించాలని సూచించారు.

తక్షణ ప్రభావం పడే గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ పనులు పూర్తయితే బస్వాపూర్‌, గౌరవెల్లి ప్రాజెక్టుల్లో నీరు నింపే అవకాశం ఉంటుందని తెలిపారు.

ఎత్తిపోతల సామర్థ్యంపై అధ్యయనం

గట్టు, గూడెందొడ్డి ఎత్తిపోతల సామర్థ్యం పెంపుపై సమగ్ర అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. గూడెందొడ్డి పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి కన్సల్టెంట్‌ను నియమించాలని సూచించారు.

ఎన్‌డీఎస్‌ఏ సూచనలు తప్పనిసరిగా పాటించాలి

జాతీయ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) సూచనల మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదని సీఎం పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్‌డీఎస్‌ఏ సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

మేడిగడ్డతో పాటు సుందిళ్ల బ్యారేజీలోనూ పలు లోపాలు ఉన్నట్లు తేలిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించగా.. ఈ అంశంపై ఎన్‌డీఎస్‌ఏతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!