కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మంత్రి పొంగులేటి వినతి.. తెలంగాణ పర్యటనకు ఆహ్వానం
న్యూఢిల్లీ, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జీ) 2.0 కింద తెలంగాణకు 11,56,915 ఇళ్లను ఒకే విడతలో మంజూరు చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను బుధవారం ఢిల్లీలో కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో సీఎం రేవంత్‌రెడ్డి రాసిన లేఖను కూడా మంత్రి ప్రస్తావించారు.
‘ఆవాస్ ప్లస్–2024’ యాప్ ద్వారా తెలంగాణలో పారదర్శకంగా ఇంటింటి సర్వే నిర్వహించామని పొంగులేటి తెలిపారు. ఇందులో 11.56 లక్షలకు పైగా గ్రామీణ పేద కుటుంబాలు ఇళ్ల మంజూరుకు అర్హులుగా గుర్తించబడ్డాయని చెప్పారు. అనర్హుల తొలగింపు, సూపర్ చెక్ ప్రక్రియ కూడా ఏడాది క్రితమే పూర్తయినా.. కేంద్రం నుంచి ఇళ్ల లక్ష్యాలు ఇంకా ప్రకటించలేదని వివరించారు.
గత 12 ఏళ్లుగా తెలంగాణలో పేదల ఇళ్ల నిర్మాణం నిలిచిపోవడంతో భారీగా పెండింగ్ డిమాండ్ ఏర్పడిందని, అందువల్ల మొత్తం ఇళ్లను ఒకే విడతలో మంజూరు చేయాలని కోరారు.
పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి తెలిపారు. కేంద్ర సాయం, పీఎంఏవై–జీ కింద రాష్ట్ర వాటాకు అదనంగా ఈ సాయం అందిస్తున్నామని, ఇందుకు అవసరమైన నిధులను రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించినట్లు చెప్పారు.
పీఎంఏవై–జీ 2.0 కింద ఇళ్ల కేటాయింపును స్వయంగా తెలంగాణకు వచ్చి ప్రకటించాలని మంత్రి పొంగులేటి కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను ఆహ్వానించారు. కేంద్ర మంత్రి రాష్ట్రంలో పర్యటించి ఇళ్ల కేటాయింపును ప్రకటిస్తే తెలంగాణ గ్రామీణ పేదలకు ఎంతో మేలు జరుగుతుందని, ఇది చారిత్రాత్మక సందర్భంగా నిలుస్తుందని తెలిపారు. దీనికి శివరాజ్‌సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించి తెలంగాణ పర్యటనకు అంగీకరించారు.
ఈ సమావేశంలో ఎంపీలు డాక్టర్ మల్లు రవి, వం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, సురేశ్ షెట్కార్, రామసహాయం రఘురాంరెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌తో పాటు తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి. గౌతమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

