9 మంది విద్యార్థుల కోసం గాలింపు.. స్కూల్‌లో ఘటనలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలి: డీసీపీ
సికింద్రాబాద్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీచైతన్య టెక్నో స్కూల్ హాస్టల్‌లో కామారెడ్డికి చెందిన పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి చేసిన ఘటనలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. స్కూల్ ప్రిన్సిపల్ జె. మనోజ్‌కుమార్, హాస్టల్ వార్డెన్ ఎం. బాబు, హాస్టల్ ఇన్‌చార్జి జె. ఆకాష్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు మల్కాజిగిరి డీసీపీ సీహెచ్ శ్రీధర్ తెలిపారు.
విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కారణంగానే దాడి జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో తేలిందని డీసీపీ తెలిపారు. కుటుంబ సభ్యులను దుర్భాషలాడటంతో విద్యార్థుల మధ్య గొడవ మొదలైందని, అనంతరం ఓ విద్యార్థిపై కొంతమంది తోటి విద్యార్థులు విచక్షణారహితంగా దాడి చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ దాడిలో విద్యార్థికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు.
కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ఓపీ టికెట్‌లో వైద్యులు నమోదు చేసిన వివరాల ప్రకారం.. విద్యార్థి శరీరంపై పలు చోట్ల గాయాలున్నట్లు పేర్కొన్నారు. ఎగువ, మధ్య వెన్నుభాగంలో పలుచోట్ల గాయాల గుర్తులు, తల ఎడమ పారియేటల్ ప్రాంతంలో గాయం, కుడి మాలర్ ప్రాంతంలో గాయం, కుడి భుజంపై బలమైన గాయం ఉన్నట్లు వైద్య రికార్డులో నమోదు చేశారు.
- ఎగువ, మధ్య వెన్నుభాగంలో పలుచోట్ల గాయాల గుర్తులు
- తల ఎడమ పారియేటల్ ప్రాంతంలో గాయం
- కుడి మాలర్ ప్రాంతంలో గాయం
- కుడి భుజంపై బలమైన గాయం
- నోరు తెరవడంలో ఇబ్బంది
- పెదవిపై గాయం ఉన్నట్లు వైద్య రికార్డులో నమోదు
అలాగే వైద్యులు సీటీ బ్రెయిన్, ఎంఆర్‌ఐ లంబార్ స్పైన్ పరీక్షలు చేయించుకోవాలని సూచించినట్లు కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రికార్డుల్లో ఉంది.
అయితే విద్యార్థి కాలు జారి పడిపోయాడని పాఠశాల యాజమాన్యం అతడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిందన్నారు. ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టామని, విద్యార్థుల వాంగ్మూలాలు, అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చిందని డీసీపీ పేర్కొన్నారు.
దాడికి సంబంధించి 9 మంది విద్యార్థులను నిందితులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారిలో పలువురు మైనర్లు ఉండటంతో వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు బాధితుడి తల్లికి ఘటనపై తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించడంతో స్కూల్ ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్, హాస్టల్ ఇన్‌చార్జిపై కూడా కేసులు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.
ప్రతి విద్యాసంస్థలో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానిదేనని డీసీపీ సీహెచ్ శ్రీధర్ స్పష్టం చేశారు. స్కూల్, హాస్టల్ ఆవరణలో ఎలాంటి గొడవలు, విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగినా వాటిని యాజమాన్యం దాచిపెట్టకుండా వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు.
ఘటనలను పోలీసులకు తెలియజేయకుండా దాచిపెట్టే విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. విద్యార్థుల భద్రత విషయంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.

