రాజీవ్ గృహకల్పలో బస్సు ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
కీసర, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ డివిజన్ రాజీవ్ గృహకల్పలో విద్యుత్ శాఖ సిబ్బంది చెట్ల కొమ్మలను నరికిన అనంతరం వాటిని తొలగించకుండా రహదారిపైనే వదిలేయడంతో బస్సు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
చెట్ల కొమ్మలు రహదారిపై పేరుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడి బస్సులు వెళ్లేందుకు ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. దీంతో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
ప్రధానంగా రహదారి ఇరుకుగా మారడంతో బస్సులు, ఇతర వాహనాలు ఒకేసారి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రద్దీ సమయాల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు.
విద్యుత్ పనులు పూర్తయిన వెంటనే నరికిన కొమ్మలను తొలగించి రహదారిని శుభ్రం చేయాల్సి ఉన్నప్పటికీ, వాటిని అలాగే వదిలేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల రాకపోకలు, ముఖ్యంగా బస్సు ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, రహదారిపై ఉన్న చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని విద్యుత్ శాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు.
అధికారులు తక్షణమే స్పందించి రహదారిని క్లియర్ చేసి బస్సులు, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

