పేపర్ నోట్ల స్థానంలో వెంటనే రావు.. తొలుత 200 కోట్ల పాలిమర్ నోట్లతో ఫీల్డ్ ట్రయల్స్
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): దేశంలో కరెన్సీ నోట్ల రూపంలో కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.10, రూ.20 డినామినేషన్లలో పాలిమర్ (ప్లాస్టిక్) నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో రూ.10, రూ.20 నోట్లను చెరో 100 కోట్ల చొప్పున.. మొత్తం 200 కోట్ల పాలిమర్ నోట్లను ఫీల్డ్ ట్రయల్స్ కోసం జారీ చేయనుంది. ఈ నోట్ల మొత్తం విలువ సుమారు రూ.3,000 కోట్లు.
ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లను వెంటనే తొలగించి వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రయోగాత్మకంగా పాలిమర్ నోట్లను కాగితపు నోట్లతోపాటు చలామణిలోకి తీసుకువచ్చి.. వాటి మన్నిక, వినియోగ సౌలభ్యం, భద్రత, ప్రజల స్పందన తదితర అంశాలను పరిశీలించనున్నారు.
రూ.10, రూ.20 నోట్లు ప్రజల చేతుల్లో అత్యధికంగా తిరుగుతుండటంతో త్వరగా పాడైపోతుంటాయి. పాలిమర్ నోట్లు కాగితపు నోట్లతో పోలిస్తే ఎక్కువకాలం మన్నుతాయని, తేమ, మురికి, చిరిగిపోవడాన్ని మెరుగ్గా తట్టుకుంటాయని భావిస్తున్నారు. నోట్ల మన్నిక పెరగడం వల్ల తరచూ పాత నోట్లను వెనక్కి తీసుకుని కొత్త నోట్లను ముద్రించాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో నకిలీ నోట్ల తయారీని కష్టతరం చేసే ఆధునిక భద్రతా లక్షణాలను ఇందులో పొందుపరిచే అవకాశం ఉంది.
ఫీల్డ్ ట్రయల్స్ విజయవంతమైతే పాలిమర్ రూ.10, రూ.20 నోట్లను సాధారణంగా జారీ చేసే ప్రక్రియను 2027 ఏప్రిల్ నుంచి, అంటే 2027-28 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి చేపట్టే అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. అయితే ఇది పూర్తిస్థాయి అమలుకు సంబంధించిన తుది నిర్ణయం కాదని, ట్రయల్స్ ఫలితాల ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.
భారత్‌లో పాలిమర్ నోట్లపై గతంలోనూ ప్రయోగాలు జరిగాయి. దాదాపు 15 ఏళ్ల క్రితం రూ.10 పాలిమర్ నోట్లపై ఫీల్డ్ ట్రయల్స్ చేపట్టే ప్రయత్నం జరిగినప్పటికీ అది ముందుకు సాగలేదు. ఇప్పుడు మరోసారి రూ.10, రూ.20 నోట్లతో ప్రయోగాన్ని ప్రారంభించేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది.
ప్రస్తుతం అలాంటి నిర్ణయం ఏదీ లేదు. పాలిమర్ నోట్లు ప్రవేశపెట్టినా, ఇప్పటికే చలామణిలో ఉన్న కాగితపు రూ.10, రూ.20 నోట్లు చట్టబద్ధంగానే కొనసాగుతాయి. కొత్త నోట్ల ప్రయోగం విజయవంతమై, భవిష్యత్తులో సాధారణ జారీకి నిర్ణయం తీసుకున్నా.. కాగితపు నోట్లను ఎలా మార్చాలనే దానిపై ఆర్‌బీఐ తదుపరి మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.
అంటే.. ప్రస్తుతానికి రూ.10, రూ.20 నోట్లపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. ముందుగా 200 కోట్ల పాలిమర్ నోట్లతో ప్రయోగం.. ఫలితాలను బట్టి 2027-28లో తదుపరి నిర్ణయం తీసుకోనుంది ఆర్‌బీఐ.

