📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిచింతా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్

చింతా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఫైర్

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?.. ఎమ్మెల్యేకు సవాల్

సంగారెడ్డి, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధితో పాటు తాము లేవనెత్తుతున్న అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ చింతా ప్రభాకర్‌కు సవాల్ విసిరారు.

2017లో సంగారెడ్డిలో నిర్వహించిన రాహుల్ గాంధీ సభ విజయవంతమైన తర్వాత జగ్గారెడ్డిపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడిందన్న వ్యాఖ్యలకు చింతా ప్రభాకర్ ఇచ్చిన కౌంటర్ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతా ప్రభాకర్ కుటుంబానికి సంబంధించిన భూముల వ్యవహారాలపై పలు ఆరోపణలు చేశారు. సీలింగ్ భూముల రిజిస్ట్రేషన్, దళితుల భూములు, సదాశివపేటలో రోడ్లు, మాలకుంటకు సంబంధించిన అంశాలపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సదాశివపేటలో ఎక్కడైనా బహిరంగ చర్చకు తాము సిద్ధమని ప్రకటించారు.

సంగారెడ్డి అభివృద్ధికి జగ్గారెడ్డి చేసిన కృషిని ప్రజలు గుర్తించారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఐఐటీ ఏర్పాటు, ఇంటింటికీ మంజీరా నీరు, సంగారెడ్డి–లింగంపల్లి నాలుగు లేన్ల రహదారి, ప్రభుత్వ పాలిటెక్నిక్, అగ్రికల్చర్, పీజీ కళాశాలల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో జగ్గారెడ్డి కీలక పాత్ర పోషించారని తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు ఆక్సిజన్ సిలిండర్లు అందించి అండగా నిలిచారని గుర్తుచేశారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండే నాయకుడు జగ్గారెడ్డి అని పేర్కొన్నారు.

ఇకపై బీఆర్ఎస్ నేతల అవినీతికి సంబంధించిన అంశాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు తీసుకొస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, సీడీసీ చైర్మన్ రామ్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మునిపల్లె సత్యనారాయణ, కూన సంతోష్, షఫీ హఫీజ్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!