జహీరాబాద్‌లో ట్యాంకర్ ఢీకొని ఏడుగురు కూలీల దుర్మరణం.. కోహీర్‌లో డివైడర్ దాటి కారు బీభత్సం…
సంగారెడ్డి, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి):
సంగారెడ్డి జిల్లాలో మంగళవారం రాత్రి జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో
తొమ్మిది మంది మృతి చెందారు. జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం
సమీపంలో కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది.
ప్రమాద ధాటికి ఆటో నుజ్జునుజ్జు కాగా.. ఏడుగురు కూలీలు ఘటనా స్థలంలోనే
ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా
ఉన్నట్లు సమాచారం.
మృతులంతా కర్ణాటకలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ
కూలీలుగా పోలీసులు గుర్తించారు. జహీరాబాద్ ప్రాంతంలో వ్యవసాయ పనులు
ముగించుకుని ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని
సహాయక చర్యలు చేపట్టారు.
- ఆటోను బలంగా ఢీకొట్టిన ట్యాంకర్
- ఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి
- మరో ఐదుగురికి తీవ్ర గాయాలు
- ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు
చేపట్టారు. ప్రమాదం కారణంగా రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో
పోలీసులు వాహనాలను క్రమబద్ధీకరించారు.
మరోవైపు కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి సమీపంలోని 65వ జాతీయ రహదారిపై
మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి డివైడర్
పైనుంచి అవతలి వైపుకు ఎగిరి పడింది. ఎదురుగా వస్తున్న నాలుగు వాహనాలను
ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు
సమాచారం. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
- డివైడర్ దాటి అవతలి వైపునకు దూసుకెళ్లిన కారు
- ఎదురుగా వస్తున్న నాలుగు వాహనాలకు ఢీ
- ఇద్దరు అక్కడికక్కడే మృతి
- పలువురికి గాయాలు
ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
ఒకే రాత్రి జిల్లాలో రెండు ఘోర ప్రమాదాలు చోటుచేసుకుని
తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది.
ప్రమాదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

