అరుదైన విదేశీ జాతి కోతితో రీల్.. వైరల్ కావడంతో డిలీట్.. వన్యప్రాణి అధికారుల విచారణ..
చెన్నై, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి):
కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ అరుదైన విదేశీ జాతి కోతితో చేసిన రీల్ వివాదానికి దారితీసింది. విక్రమ్ కోతితో సన్నిహితంగా గడుపుతూ, దాని హావభావాలను అనుకరిస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. వీడియో వైరల్ కావడంతో వన్యప్రాణి సంరక్షణ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
కోతిని పెంచుతున్నది ఎవరు? అది ఎక్కడి నుంచి వచ్చింది? దానిని ఉంచేందుకు అవసరమైన అనుమతులు, పత్రాలు ఉన్నాయా? అనే అంశాలపై ప్రశ్నలు తలెత్తాయి. విమర్శలు రావడంతో విక్రమ్ 24 గంటల్లోనే వీడియోను తొలగించారు. ఈ వ్యవహారంపై తమిళనాడు అటవీ శాఖ దృష్టి సారించి కోతి యాజమాన్యం, మూలం, కొనుగోలు, రవాణా వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
విక్రమ్ తన ఇంట్లో కాకుండా కుమార్తె అత్తింటివారికి చెందిన ఆస్తిలో ఈ వీడియో చిత్రీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులోని వ్యాపారవేత్త సీకే రంగనాథన్‌కు చెందిన ఆస్తిలో రీల్ చేసినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. రంగనాథన్ విక్రమ్ అల్లుడు మను రంజిత్ తండ్రి.
వీడియోలో కనిపించిన కోతి ‘లార్ గిబ్బన్’ అనే అరుదైన జాతికి చెందినదిగా గుర్తించినట్లు సమాచారం. అంతరించిపోయే ప్రమాదం ఉన్న జాతిగా పేర్కొంటున్న నేపథ్యంలో దానిని భారత్‌లో ఉంచడం, తరలించడం, కొనుగోలు చేయడానికి అవసరమైన అనుమతులు, పత్రాలు ఉన్నాయా? అనే అంశంపై అధికారులు దృష్టి సారించారు.
ఆ కోతిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కొనుగోలు పత్రాలు ఏమిటి? భారత్‌కు ఎలా చేరింది? అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. కొన్ని నివేదికల్లో మణిపూర్ మీదుగా తమిళనాడులోని ఈరోడ్‌కు తీసుకొచ్చినట్లు పేర్కొన్నప్పటికీ.. దాని మూలం, రవాణా, యాజమాన్య వివరాలను అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
వన్యప్రాణుల అక్రమ రవాణా ముఠాల ప్రమేయం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ విచారణ సాగుతున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు విక్రమ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లు అటవీ శాఖ అధికారికంగా నిర్ధారించలేదు. విచారణ పూర్తయితేనే కోతి భారత్‌కు ఎలా వచ్చింది, అవసరమైన పత్రాలు ఉన్నాయా, నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశాలపై స్పష్టత రానుంది.

