📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ గడువులోగా పూర్తి కావాల్సిందే !

ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ గడువులోగా పూర్తి కావాల్సిందే !

నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదు.. మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టాలి.. అక్టోబర్‌ 31 నాటికి అందుబాటులోకి తేవాలి: మంత్రి కోమటిరెడ్డి..

హైదరాబాద్‌, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల్సిందేనని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. పనుల్లో నిర్లక్ష్యం, జాప్యాన్ని సహించేది లేదన్నారు. అక్టోబర్‌ 31 నాటికి కారిడార్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను, నిర్మాణ సంస్థను ఆదేశించారు.

మూడు షిఫ్టుల్లో పనులు

ఉప్పల్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ పనుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప్పల్‌ వైపు నిత్యం ప్రయాణించే ప్రజలు ఏళ్లుగా ట్రాఫిక్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2026 దసరా నాటికి కారిడార్‌ను పూర్తి చేస్తామని ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి చేసి తీరాల్సిందేనన్నారు.

మ్యాన్‌పవర్‌ను పెంచి మూడు షిఫ్టుల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా పనులు కొనసాగించాలని సూచించారు. కారిడార్‌ కింద చేపడుతున్న 6.25 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల పురోగతిని ప్రతిరోజూ సమీక్షించాలని, ప్రతి పది రోజులకు ఒకసారి తాను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని తెలిపారు.

60 శాతం పనులు పూర్తి

ప్రస్తుతం కారిడార్‌ పనులు 60 శాతం పూర్తయ్యాయని, మిగిలిన 40 శాతం పనులు కొనసాగుతున్నాయని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. సెగ్మెంట్ల తయారీ కోసం నాలుగు బెడ్లు, నాలుగు గ్యాంట్రీలతో 300 మంది కార్మికులు రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నారని వివరించారు.

పనుల్లో వేగం పెంచేందుకు నారపల్లి (సీపీఆర్‌ఐ), ఉప్పల్‌ వైపుల నుంచి రెండు దిశల్లో లాంచింగ్‌ గడ్డర్లను ఏర్పాటు చేసి పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. ఉప్పల్‌ వైపు ఇప్పటికే ఒక స్లాబ్‌ పూర్తయిందని, రెండో స్లాబ్‌ పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

గడువు దాటకూడదు

రాత్రిపూట పనులు, వర్షాల కారణంగా పనులు పూర్తిచేయడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్పగా.. మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ట్రాఫిక్‌ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

నెలకు ఆరు స్లాబుల చొప్పున పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ ప్రతినిధులు తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి 2026లోనే కారిడార్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి మరోసారి ఆదేశించారు.

సమీక్షలో ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ ధర్మారెడ్డితో పాటు పలువురు అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!