అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం.. 14లోగా 22ఎ, పీఓబీ డాక్యుమెంట్లన్నీ ఆన్‌లైన్‌లోకి..
హైదరాబాద్, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి):
నిషేధిత ఆస్తుల పీఓబీ, 22ఎ జాబితాలో ఉన్న భూముల విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. చట్టబద్ధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నుంచి కొనసాగుతున్న సాంకేతిక, చట్టపరమైన సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు.
మంగళవారం సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో 22ఎ, పీఓబీ అంశంపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆయా జిల్లాల్లో వచ్చిన దరఖాస్తులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
భూముల రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు, మెమోలు, భూసేకరణ ప్రొసీడింగ్స్, లే-అవుట్ అనుమతులు తదితర అన్ని డాక్యుమెంట్లను ఈ నెల 14లోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనివల్ల నకిలీ పత్రాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రిజిస్ట్రేషన్ సమయంలో అసలు, నకిలీ పత్రాలను గుర్తించేందుకు వీలవుతుందని చెప్పారు. సబ్ రిజిస్ట్రార్లకు పహానీలను కూడా ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
పీఓబీ, 22ఎకు వచ్చిన ప్రతి దరఖాస్తును కేసుల వారీగా పరిశీలించి, అర్హత ఉన్న వాటిని యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా పేదలు, అర్హులకు అన్యాయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కంటే సమస్య తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లపై ఉందన్నారు.
సబ్ రిజిస్ట్రార్ల విచక్షణాధికారాలను పరిమితం చేయాలని మంత్రి స్పష్టం చేశారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. పీఓబీ జాబితాలో ఉన్న ఆస్తుల రిజిస్ట్రేషన్లను గుడ్డిగా తిరస్కరించకుండా.. తిరస్కరణకు కారణాలను మూడు రోజుల్లో స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. పీఓబీ దరఖాస్తులను ఇకపై తహసీల్దార్లకు కాకుండా నేరుగా కలెక్టర్లకు పంపాలని ఆదేశించారు.
“ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవు. అదే సమయంలో చట్టబద్ధంగా అర్హులైన ప్రజలకు అన్యాయం జరగకుండా అధికారులు ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి.”
నాలుగు జిల్లాల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్లతో సమావేశం నిర్వహించి ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీని మంత్రి ఆదేశించారు. సమావేశంలో రెవెన్యూ సెక్రటరీ డీఎస్ లోకేశ్‌కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లు పాల్గొన్నారు.

