📄 ePaper
Wednesday, August 12, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విద్యుత్‌ ఉచ్చులో చిక్కుకుని ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి !!

విద్యుత్‌ ఉచ్చులో చిక్కుకుని ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి !!

వన్యప్రాణుల వేటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చే బలితీసుకుంది.. కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): వన్యప్రాణుల వేట కోసం ఏర్పాటు చేసిన విద్యుత్‌ ఉచ్చులో చిక్కుకుని చెరువుసింగారం ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతి చెందారు. విధి నిర్వహణలో భాగంగా వేటగాళ్లను పట్టుకునేందుకు వెళ్లిన ఆయన విద్యుత్‌ తీగల ఉచ్చులో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడం పట్ల అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

వేటగాళ్ల కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులోనే విషాదం

బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామంలో అనుమానితులు వన్యప్రాణులను వేటాడుతున్నారన్న సమాచారంతో నవీన్‌ మరో ముగ్గురు బీట్‌ ఆఫీసర్లతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్‌ ఉచ్చులో చిక్కుకున్న నవీన్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎఫ్‌ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్‌ మంత్రికి వివరించారు.

బాధ్యులపై కఠిన చర్యలు

ఘటనపై మంత్రి సురేఖ డీఎఫ్‌ఓతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వన్యప్రాణులను వేటాడేందుకు విద్యుత్‌ తీగలను అమర్చడం అత్యంత ప్రమాదకరమైన చర్య అని పేర్కొన్నారు. ఇలాంటి అక్రమాల వల్ల వన్యప్రాణులతో పాటు అటవీ సిబ్బంది, స్థానిక ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఘటనపై అటవీ, పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో అటవీ సిబ్బంది చేస్తున్న సేవలు అమూల్యమైనవని మంత్రి అన్నారు.

కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం

మృతుడు నవీన్‌ కుటుంబానికి మంత్రి సురేఖ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం ఆయన కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించేలా త్వరితగతిన చర్యలు చేపట్టాలని పీసీసీఎఫ్‌ వినయ్‌కుమార్‌ను ఆదేశించారు.

విధి నిర్వహణలో అటవీ సిబ్బంది భద్రతకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!