తెలంగాణ ఇంధన రంగం, పునరుత్పాదక విద్యుత్‌పై విస్తృత చర్చ..
బర్కిలీ, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ బర్కిలీకి చెందిన గోల్డ్‌మన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలోని ఇండియా ఎనర్జీ అండ్ క్లైమేట్ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు, వాటిని సాధించే మార్గాలు, తెలంగాణలో జరుగుతున్న ఇంధన మార్పుపై కేంద్రం ప్రతినిధులు, పరిశోధకులతో చర్చించారు.
2030 నాటికి 500 గిగావాట్ల నాన్-ఫాసిల్ ఇంధన సామర్థ్యాన్ని సాధించాలన్న జాతీయ లక్ష్యంతో పాటు ఇంధన భద్రత, గ్రిడ్ ఆధునికీకరణ, పారిశ్రామిక రంగంలో కర్బన ఉద్గారాల తగ్గింపు, విద్యుత్ నిల్వ వ్యవస్థలు, స్వచ్ఛ ఇంధన సాంకేతికతల విస్తరణపై చర్చ జరిగింది.
తెలంగాణలో అమలు చేస్తున్న గ్రీన్ పవర్ పాలసీ, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు వచ్చిన పెట్టుబడులు, సౌర విద్యుత్ విస్తరణ, మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ కార్యక్రమాలు, పీఎం-కుసుమ్ వంటి రైతు కేంద్రిత పథకాలపై వివరించారు.
24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా, క్లీన్ ఎనర్జీ పరికరాల తయారీ, పారిశ్రామిక అభివృద్ధితో పునరుత్పాదక విద్యుత్‌ను అనుసంధానించే తెలంగాణ విధానాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇంధన, పరిశ్రమ, రవాణా, వాతావరణ మార్పుల రంగాల్లో భవిష్యత్ సాంకేతిక సహకారం, విధాన రూపకల్పనలో సామర్థ్య పెంపు, ఉమ్మడి అధ్యయనాలు, క్లీన్ టెక్నాలజీల వేగవంతమైన అమలుపై కూడా చర్చించారు.

