📄 ePaper
Wednesday, September 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్అంగరంగ వైభవంగా లాల్‌దర్వాజా బోనాలు !

అంగరంగ వైభవంగా లాల్‌దర్వాజా బోనాలు !

అమ్మవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిన పాతబస్తీ

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
అమ్మవారి దర్శనం చేసుకుంటున్న నాయకులు
అమ్మవారి దర్శనం చేసుకుంటున్న సిపి సజ్జనార్ బృందం

హైదరాబాద్‌, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో లాల్‌దర్వాజా పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ, ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆలయాన్ని సందర్శించి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు సంప్రదాయబద్ధంగా వారికి స్వాగతం పలికారు.

బోనాలకు రూ.20 కోట్లు కేటాయింపు

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌ బోనాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, సింహవాహిని మహంకాళి ఆలయ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

నెల రోజులుగా హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించిన అధికారులను మంత్రి అభినందించారు. చివరి వరుసలో ఉన్న భక్తుడికి కూడా అమ్మవారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. తెలంగాణకు సమృద్ధిగా వర్షాలు కురిసి, రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ హైదరాబాద్‌ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించిందన్నారు. అన్ని ఆలయాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.

కలెక్టర్‌ బంగారు బోనం సమర్పణ

అనంతరం హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌. నందా, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ప్రియాంక అల అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్‌ అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. అర్చకులు, ఆలయ అధికారులు వారికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు

ఎంపీలు కిరణ్‌ చామల, అనిల్‌కుమార్‌ యాదవ్‌, మాజీ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ బండా ప్రకాశ్‌, ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే టాగోర్‌, మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌, దేవాదాయ శాఖ కమిషనర్‌ హనుమంతరావు, హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌, డీసీపీ, ప్రత్యేక అధికారి రవి, ఆర్డీవో రామకృష్ణ, వివిధ శాఖల అధికారులు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!