ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర నీటి కొరత.. ఆరుతడి పంటల వైపు రైతులు మళ్లాలి: మంత్రి కోమటిరెడ్డి..
నల్గొండ, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి):
ఎల్‌నినో ప్రభావంతో నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం ఉన్న నీరు తాగునీటి అవసరాలకే సరిపోతుందని, ఎగువ నుంచి నీరు వచ్చే పరిస్థితి కూడా లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయకుండా ఆరుతడి పంటలు వేసుకునేలా అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
శనివారం నల్గొండ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజీలో ఉందని, శ్రీశైలం నుంచి నీరు వచ్చినా పంటలకు సాగునీరు అందించే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుతం ఉన్న నీరు 2027 జూన్ వరకు తాగునీటి అవసరాలకు మాత్రమే సరిపోతుందని పేర్కొన్నారు. సాగర్ నిండినా చెరువులు నింపే పరిస్థితి ఉండదని, భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నాయని తెలిపారు.
ఏఎంఆర్పీ కూడా సగమే నిండిందని, గతంలో ఎన్నడూ లేని పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో దక్షిణ తెలంగాణలో పరిస్థితులు మరింత కఠినంగా మారే అవకాశం ఉన్నందున రైతులకు అండగా నిలవాలని అధికారులను కోరారు. జిల్లాలో ఇప్పటికే 33 వేల ఎకరాల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగు చేశారని, ఈ విస్తీర్ణాన్ని లక్షన్నర ఎకరాలకు పెంచాలని సూచించారు.
నిరంతరం వరి సాగు, అధికంగా ఎరువుల వినియోగంతో భూముల సారం దెబ్బతింటుందని మంత్రి అన్నారు. రైతులను కూరగాయలు, ఉద్యాన పంటలు, సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించాలని సూచించారు. జిల్లాకు 5 వేల స్ప్రింక్లర్ యూనిట్లు అవసరమని అధికారులు కోరగా, వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.
జిల్లాలోని 9 వేల ట్రాన్స్ఫార్మర్లపై ఓవర్‌లోడ్ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అవసరమైన విద్యుత్ సామగ్రిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులను 2028 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని, ఏఎంఆర్పీ, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టుల ద్వారా జిల్లాలో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఎగువ నుంచి సాగునీరు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందున పంటలు, తాగునీరు తదితర అవసరాలపై ముందస్తు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 వరకు ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉన్నందున వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను చైతన్యపరచాలని సూచించారు.

