రైతన్నకు, నేతన్నకు సమాన ప్రాధాన్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…
హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):
జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత & జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ పరమావధి అని, రైతన్నకు, నేతన్నకు సమాన ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని మంత్రి స్పష్టం చేశారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను మంత్రి ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత కళాకారులు ఏర్పాటు చేసిన 100కు పైగా చేనేత స్టాల్స్‌ను ప్రారంభించి పరిశీలించారు. ఆగస్టు 7 నుంచి 16 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున సందర్శించి చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.

