ఈ-కేవైసీ పూర్తి చేయాలని గ్యాస్ సంస్థల సూచన.. ఆలస్యం చేస్తే సబ్సిడీ, సేవలపై ప్రభావం పడే అవకాశం
హైదరాబాద్, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):
దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) గ్యాస్ వినియోగదారులు ఆగస్టు 16లోగా తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని ఇండేన్, భారత్ గ్యాస్, హెచ్‌పీ గ్యాస్ సంస్థలు సూచిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న వినియోగదారులు వెంటనే ఆధార్ ఆధారిత ధ్రువీకరణ పూర్తి చేసుకోవాలని కోరుతున్నాయి. గడువులోగా ఈ-కేవైసీ చేయకపోతే సబ్సిడీ పొందడంలో, గ్యాస్ సేవలు కొనసాగడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఈ-కేవైసీ ప్రక్రియ పారదర్శకత కోసం చేపట్టిన చర్య అని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఈ-కేవైసీ చేయని వినియోగదారులు మాత్రమే దీనిని పూర్తి చేయాల్సి ఉంటుందని, ఇప్పటికే పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉజ్వల (PMUY) లబ్ధిదారులు మాత్రం నిబంధనల ప్రకారం అవసరమైన సందర్భాల్లో ఈ ధ్రువీకరణ పూర్తి చేయాలి.
ఈ-కేవైసీని గ్యాస్ ఏజెన్సీల వద్ద బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా లేదా ఆయా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మొబైల్ యాప్, ఆధార్ ఫేస్ ఆర్డీ (FaceRD) యాప్ ద్వారా ఇంటి నుంచే పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులకు గ్యాస్ బుకింగ్‌లు, రీఫిల్ సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని గ్యాస్ సంస్థలు వినియోగదారులకు సూచిస్తున్నాయి.

