📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జెన్‌జీపై సంపూర్ణ విశ్వాసం.. నిరసనలు దేశద్రోహం కావు: మోహన్‌ భగవత్‌ !

జెన్‌జీపై సంపూర్ణ విశ్వాసం.. నిరసనలు దేశద్రోహం కావు: మోహన్‌ భగవత్‌ !

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు యువతది.. విద్య, సోషల్‌ మీడియా, నాయకత్వం, LGBTQపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు…

ముంబై, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి):

నిరసనలు చేస్తున్న జెన్‌జీ యువతను దేశద్రోహులుగా ముద్ర వేయడం సరికాదని ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు. నేటి యువతపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, అవసరమైతే “జెన్‌జీని గుడ్డిగా నమ్ముతా” అని వ్యాఖ్యానించారు. ముంబైలో జరిగిన ఇండియాస్ ఇంటర్నేషనల్ మూవ్‌మెంట్ టు యునైట్ నేషన్స్ (IIMUN) 15వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రజాస్వామ్యంలో చర్చ, భిన్నాభిప్రాయాలు, నిరసనలు సహజ ప్రక్రియలేనని భగవత్‌ అన్నారు. విద్యార్థులు ఆందోళన చేస్తే వారిని దేశ వ్యతిరేకులుగా చూడకూడదని, వారి ఆందోళనల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. దేశ విద్యా వ్యవస్థలో ఇంకా అనేక సంస్కరణలు అవసరమని, అందుకే సంభాషణ ఎంతో ముఖ్యమన్నారు.

జెన్‌జీ, జెన్‌ ఆల్ఫా తరం గత తరాల కంటే ఎక్కువ నిజాయితీ కలిగినదని పేర్కొన్న ఆయన.. అధికారులను ప్రశ్నించడం, ప్రతి విషయానికీ తార్కిక సమాధానం కోరడం ఈ తరం ప్రత్యేకత అని చెప్పారు. యువత నిరసన చేయవద్దని తాను ఎప్పుడూ చెప్పబోనని, అయితే ప్రజాస్వామ్యబద్ధమైన మార్గాల్లోనే తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని సూచించారు.

నాయకత్వం అంటే ఎన్నికల్లో గెలవడం లేదా ప్రసంగాలు చేయడం మాత్రమే కాదని, తనతో పాటు మరిన్ని నాయకులను తయారు చేయడమే నిజమైన నాయకుడి లక్షణమని భగవత్‌ పేర్కొన్నారు. విజయాన్ని సహచరులతో పంచుకునే వ్యక్తే నిజమైన నాయకుడని అన్నారు.

విద్యను వ్యాపారంగా మార్చకూడదని, అది సమాజం మొత్తం బాధ్యతగా భావించాలని చెప్పారు. విద్యారంగానికి జాతీయ బడ్జెట్‌లో ఆరు శాతం నిధులు కేటాయించాలన్న డిమాండ్ ఇప్పటికీ సముచితమేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు నాణ్యమైన శిక్షణతో పాటు సమాజం కూడా విద్యాభివృద్ధిలో భాగస్వామి కావాలని సూచించారు.

సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిని కేవలం చట్టాలతో అరికట్టలేమని, ప్రజల ఆలోచనా విధానం మారాల్సిన అవసరం ఉందన్నారు. భారీ ఫాలోయింగ్ ఉన్న సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, హింసాత్మక కంటెంట్‌కు ఎందుకు ఎక్కువ ఆదరణ లభిస్తుందో సమాజం ఆలోచించాలని సూచించారు.

పాకిస్థాన్‌, చైనా వంటి దేశాలతో విభేదాల సమయంలో ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని, అయితే శాశ్వత శత్రుత్వం పరిష్కారం కాదని వ్యాఖ్యానించారు. మానవత్వమే అంతిమ విలువ అని పేర్కొన్నారు.

LGBTQ వర్గాలు కూడా సమాజంలో భాగమేనని మోహన్‌ భగవత్‌ అన్నారు. స్వలింగ వివాహాలను సమర్థించబోనని స్పష్టం చేసిన ఆయన.. స్వలింగ సహజీవనానికి సమాజంలో తగిన వ్యవస్థను రూపొందించే దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. చట్టాలు సమాజాన్ని నడపవని, సమాజమే చట్టాలను ప్రభావితం చేస్తుందని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!