విజయవాడ స్టీల్ కంపెనీపై సీబీఐ కేసు.. రూ.24.98 కోట్ల బ్యాంకు రుణం.. తప్పుడు స్టాక్, ఆర్థిక వివరాలతో మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు
విజయవాడ, ఆగస్టు 21 (నవజ్యోతి ప్రతినిధి):
రికార్డుల్లో కోట్ల రూపాయల స్టాక్.. బ్యాంకు అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తే కనిపించింది మాత్రం
రూ.25 లక్షల విలువైన స్టాక్! విజయవాడకు చెందిన
ఓంకార విజయలక్ష్మి స్ట్రిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారం ఇప్పుడు సీబీఐ కేసుకు దారితీసింది.
కంపెనీ డైరెక్టర్లు కోట భాను ప్రసాద్, కోట శ్రావణి, కోట పృథ్వీ వెంకట తేజ, కోట రాహుల్ సాయి బాలాజీపై సీబీఐ కేసు నమోదు చేసింది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపు రూ.25 కోట్ల రుణం పొందేందుకు తప్పుడు ఆర్థిక వివరాలు,
స్టాక్ వివరాలు సమర్పించినట్లు సీబీఐ ఆరోపించింది. ఆగస్టు 18న విశాఖపట్నం సీబీఐ యాంటీ కరప్షన్ బ్రాంచ్ కేసు నమోదు చేసింది.
రూ.23.85 కోట్ల స్టాక్ ఉందని చూపి..
2017లో ఏర్పాటైన ఈ కంపెనీ ఎలక్ట్రానిక్ రెసిస్టెన్స్ వెల్డెడ్ (ERW) గ్యాల్వనైజ్డ్ పైపులు,
ఇతర స్టీల్ ఉత్పత్తుల తయారీ చేస్తోంది. 2024లో ఇప్పటికే ఉన్న రుణాన్ని కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి
యూనియన్ బ్యాంక్‌కు బదిలీ చేసుకునేందుకు కంపెనీ డైరెక్టర్లు ప్రయత్నించినట్లు సీబీఐ తెలిపింది.
ఈ సందర్భంగా సమర్పించిన పత్రాల ఆధారంగా యూనియన్ బ్యాంక్
రూ.24.98 కోట్ల ఫండ్, నాన్-ఫండ్ ఆధారిత రుణ సదుపాయాలను మంజూరు చేసింది.
తనిఖీతో బయటపడిన తేడా
బ్యాంకుకు సమర్పించిన వివరాల్లో కంపెనీ వద్ద రూ.23.85 కోట్ల విలువైన స్టాక్ ఉన్నట్లు చూపించారు.
అయితే బ్యాంకు అధికారులు యూనిట్‌లో భౌతిక తనిఖీ నిర్వహించగా.. అక్కడ ఉన్న స్టాక్ విలువ కేవలం
రూ.25 లక్షలకే పరిమితమైనట్లు గుర్తించారు.
చూపించిన స్టాక్‌కు అనుగుణంగా అమ్మకాలు, టర్నోవర్‌కు సంబంధించిన ఆధారాలు కూడా కనిపించలేదని
ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు సీబీఐ తెలిపింది.
మరో కంపెనీ ఏర్పాటు?
రుణం మంజూరైన ఆరు నెలల్లోనే ఇద్దరు డైరెక్టర్లు బ్యాంకు అనుమతి లేకుండా రాజీనామా చేసినట్లు
సీబీఐ ఆరోపించింది. అనంతరం నెరో స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మరో కంపెనీ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
బ్యాంకు అంతర్గత విచారణలో కరూర్ వైశ్యా బ్యాంకుకు భారీ మొత్తాలు బదిలీ అయినప్పటికీ..
వాటికి అనుగుణంగా అమ్మకాల ఆదాయం రాలేదని గుర్తించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
రెండు సంస్థల ద్వారా టర్నోవర్ పెంచినట్లు ఆరోపణలు
మారుతి ట్రేడర్స్, శ్రీ దుర్గా భవాని స్టీల్స్ అనే రెండు సంస్థలను 2024లో ఏర్పాటు చేసినట్లు
సీబీఐ పేర్కొంది. బ్యాంకు విచారణ సమయంలో అవి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆధారాలు లేవని తెలిపింది.
ఈ సంస్థలను ఉపయోగించి కంపెనీ టర్నోవర్‌ను కృత్రిమంగా పెంచి, బ్యాంకు రుణ అర్హతను పెంచుకున్నారా?
అన్న కోణంలో సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
రూ.26.05 కోట్లకు చేరిన బకాయిలు
రుణ ఖాతాలో వడ్డీ చెల్లింపులు నిలిచిపోవడంతో 2025 జూన్ 23న ఎన్‌పీఏగా ప్రకటించారు.
అప్పటికి అసలు, వడ్డీ కలిపి బకాయిలు సుమారు రూ.26.05 కోట్లకు చేరినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
యూనియన్ బ్యాంక్‌కు సుమారు రూ.24.81 కోట్ల నష్టం జరిగినట్లు సీబీఐ అంచనా వేసింది.
తప్పుడు పత్రాలు, స్టాక్, బుక్ డెబ్ట్స్ వివరాలు చూపించి రుణం పొందేందుకు కుట్ర చేసినట్లు
డైరెక్టర్లపై ఆరోపణలు ఉన్నాయి.
గమనిక: ఇవన్నీ సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఆరోపణలు మాత్రమే.
కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

