📄 ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆహారం, ఇంధన సరఫరాకు సముద్ర మార్గాల రక్షణ అవసరం

ఆహారం, ఇంధన సరఫరాకు సముద్ర మార్గాల రక్షణ అవసరం

ఆహారం, ఇంధన సరఫరాకు సముద్ర మార్గాల రక్షణ అవసరం

యూఎన్‌ భద్రతా మండలిలో భారత్‌ పిలుపు

ఐక్యరాజ్యసమితి, ఆగస్టు 26 (నవజ్యోతి ప్రతినిధి): ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఎరువులు, ఇంధన సరఫరాకు కీలకమైన సముద్ర మార్గాలను రక్షించేందుకు అంతర్జాతీయ సమాజం సమిష్టిగా పనిచేయాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌ పిలుపునిచ్చింది. సురక్షితమైన, ఊహించదగిన సముద్ర వాణిజ్య మార్గాలు అత్యవసర వస్తువుల నిరంతర రవాణాకు కీలకమని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి అంబాసిడర్‌ హరీశ్‌ పర్వతనేని అన్నారు.

యుద్ధాల ప్రభావం ఆహార భద్రతపై

‘ఫుడ్‌ అండర్‌ ఫైర్‌: గ్లోబల్‌, లోకల్‌ ఫుడ్‌ క్రైసిస్‌లను తగ్గించడంలో భద్రతా మండలి పాత్ర’ అంశంపై జరిగిన ఉన్నతస్థాయి చర్చలో భారత్‌ తన అభిప్రాయాలను వెల్లడించింది. యుద్ధాలు, రాజకీయ అస్థిరత కారణంగా ఇంధనం, ఎరువులు, సముద్ర రవాణా, మానవతా సహాయం, వ్యవసాయ వాణిజ్యానికి అంతరాయం ఏర్పడుతోందని భారత్‌ పేర్కొంది. వీటి ప్రభావం యుద్ధ ప్రాంతాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతపై పడుతోందని తెలిపింది.

సముద్ర మార్గాలకు భద్రత కల్పించాలి

వాణిజ్య నౌకల రాకపోకలకు అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా భద్రత, స్వేచ్ఛ కల్పించాల్సిన అవసరం ఉందని హరీశ్‌ పర్వతనేని అన్నారు. సముద్ర మార్గాల్లో అంతరాయం ఏర్పడితే ఆహారం, ఎరువులు, ఇంధనం వంటి అత్యవసర వస్తువుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. కీలక సముద్ర మార్గాలు, సముద్ర మౌలిక వసతులను రక్షించేందుకు దేశాలు సమిష్టిగా పనిచేయాలని కోరారు.

2.66 కోట్ల మందికి పైగా తీవ్ర ఆహార సంక్షోభం

2025లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధిక సంఖ్యలో సాయుధ ఘర్షణలు నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ తెలిపారు. అదే ఏడాది కనీసం 26.6 కోట్ల మంది తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొన్నారని వెల్లడించారు. సూడాన్‌, గాజాలో ఒకేసారి రెండు కరువులు అధికారికంగా నిర్ధారణ కావడం ఈ శతాబ్దంలో తొలిసారి జరిగిందని పేర్కొన్నారు.

హార్ముజ్‌ జలసంధిపై ఆందోళన

హార్ముజ్‌ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు, ఎరువుల వాణిజ్యంలో మూడో వంతు జరుగుతుందని గుటెర్రస్‌ తెలిపారు. సముద్ర మార్గాలపై ఆంక్షలు, మూసివేతల వల్ల వస్తువుల ధరలు పెరిగి, లభ్యత తగ్గుతోందని చెప్పారు. ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు కూడా ఆహారం, ఇతర వస్తువుల సరఫరా వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు.

వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవాలి

అభివృద్ధి చెందుతున్న దేశాలు దేశీయ వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకోవడం, సరఫరా మార్గాలను విస్తరించడం, నిల్వ, రవాణా మౌలిక వసతులను మెరుగుపరచడం అవసరమని భారత్‌ సూచించింది. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని కోరింది. రైతులకు ఎరువులు, నాణ్యమైన విత్తనాలు, సాంకేతికత, తక్కువ వడ్డీ రుణాలు అందుబాటులో ఉండటం కీలకమని పేర్కొంది.

చిరుధాన్యాల సాగుకు ప్రోత్సాహం

ఆహార భద్రతను కేవలం వరి, గోధుమ, మొక్కజొన్న వంటి ప్రధాన పంటలకే పరిమితం చేయకుండా వాతావరణ మార్పులను తట్టుకునే చిరుధాన్యాల వంటి పంటలను కూడా ప్రోత్సహించాలని భారత్‌ సూచించింది. చిన్న, సన్నకారు రైతుల ఉత్పాదకతను పెంచడం ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార భద్రతను బలోపేతం చేయవచ్చని హరీశ్‌ పర్వతనేని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!