📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మూడేళ్లలోనే వెయ్యి రోబోటిక్ శస్త్రచికిత్సలు.. నిమ్స్ ఘనత

మూడేళ్లలోనే వెయ్యి రోబోటిక్ శస్త్రచికిత్సలు.. నిమ్స్ ఘనత

ప్రభుత్వ పథకాలతో 90 శాతానికి పైగా ఉచితంగా సేవలు.. ప్రజారోగ్య రంగంలో మరో మైలురాయి..

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) మరో కీలక మైలురాయిని చేరుకుంది. మూడు సంవత్సరాల లోపే 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేసి ప్రజారోగ్య రంగంలో కొత్త రికార్డు సృష్టించింది. అత్యాధునిక రోబోటిక్ సాంకేతికతను ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా నిమ్స్ ప్రత్యేక గుర్తింపు పొందింది.

మూడు విభాగాల కీలక పాత్ర

మొత్తం 1,000 శస్త్రచికిత్సల్లో యూరాలజీ విభాగం అత్యధికంగా 590 రోబోటిక్ ఆపరేషన్లు నిర్వహించింది. ఇందులో ప్రోస్టేట్, మూత్రాశయ క్యాన్సర్ శస్త్రచికిత్సలు, కిడ్నీ మార్పిడి, యూరో రీకన్‌స్ట్రక్టివ్, పిల్లల శస్త్రచికిత్సలు ఉన్నాయి. సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం 248 శస్త్రచికిత్సలు, సర్జికల్ ఆంకాలజీ విభాగం 162 క్యాన్సర్ సంబంధిత రోబోటిక్ ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించింది.

90 శాతం మందికి ఉచిత చికిత్స

ఈ విజయంలో మరో విశేషం ఏమిటంటే.. మొత్తం రోబోటిక్ శస్త్రచికిత్సల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) వంటి ప్రభుత్వ పథకాల ద్వారా పూర్తిగా ఉచితంగా నిర్వహించారు. దీంతో ఖరీదైన రోబోటిక్ శస్త్రచికిత్సలు సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి.

రోగులకు మెరుగైన ఫలితాలు

రోబోటిక్ శస్త్రచికిత్సల వల్ల అత్యంత ఖచ్చితత్వంతో ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు రక్తస్రావం తగ్గడం, శస్త్రచికిత్స అనంతర నొప్పి తగ్గడం, ఆసుపత్రిలో ఉండే రోజులు తగ్గడం, త్వరగా కోలుకునే అవకాశం లభిస్తోందని వైద్యులు తెలిపారు.

వైద్య బృందానికి డైరెక్టర్ అభినందనలు

ఈ సందర్భంగా నిమ్స్ డైరెక్టర్ డా. రాహుల్ దేవరాజ్ యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, అనస్థీషియాలజీ, నర్సింగ్, ఆపరేషన్ థియేటర్ సిబ్బంది, ఇతర విభాగాల వైద్యులు, సిబ్బందిని అభినందించారు. సమిష్టి కృషి వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి కృతజ్ఞతలు

నిమ్స్‌లో అత్యాధునిక వైద్య సేవల అభివృద్ధికి సహకరించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు డా. రాహుల్ దేవరాజ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు అత్యున్నత ప్రమాణాల వైద్య సేవలు అందిస్తూ దేశంలోనే రోబోటిక్ శస్త్రచికిత్సలకు నిమ్స్ ఆదర్శంగా నిలుస్తుందని ఆయన తెలిపారు.

© 2026 నవజ్యోతి తెలుగు దినపత్రిక. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!