- ఎలాంటి అనుమతులు లేకుండా సెలవు దినాలలో తవ్వకాలు
- ప్రభుత్వ అదయానికి గండి – చూసి చూడనట్లు వ్యవహారిస్తున్న అధికారులు
మాడుగులపల్లి, జూలై 26 (నవజ్యోతి ప్రతినిధి) కేంద్రలో మట్టి అక్రమ రవాణా రోజు రోజుకు పెరుగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి, పగలు అనే తేడా లేకుండా, సెలవు దినాల్లో సైతం టిప్పర్ల ద్వారా మట్టిని ఇష్టానుసారంగా తరలిస్తున్నా సంబంధిత మైనింగ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మట్టి తవ్వకాలకు అవసరమైన అనుమతులు లేకుండానే భారీగా తవ్వకాలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా చర్యలు కనిపించకపోవడంతో అధికారుల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికంగా మట్టి మాఫియా మరింత రెచ్చిపోతుండగా, కొందరు ప్రజాప్రతినిధులు, ప్రభావశీలుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పగలు ప్రజలకు ఇబ్బందులు కలిగేలా, రాత్రివేళల్లో ఎలాంటి తనిఖీలు లేకుండా వాహనాలు మట్టి తరలిస్తుండటంతో రహదారులు దెబ్బతింటున్నాయని, దుమ్ము కాలుష్యం పెరిగి స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు చెబుతున్నారు. అక్రమ మట్టి తవ్వకాల వల్ల వ్యవసాయ భూములు, చెరువుల పరిసరాలు కూడా దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అక్రమ మైనింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కనిపించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మాడుగులపల్లి మండలంలో జరుగుతున్న మట్టి అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరిపి, అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

