కొండాపూర్, జూలై 21 (నవజ్యోతి): కొండాపూర్ మండలంలో వ్యవసాయంతో పాటు గృహ వినియోగానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని బహుజనసేన రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డప్పు రాజు ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని మల్కాపూర్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
మల్కాపూర్, అనంతసాగర్, సైదాపూర్, గంగారం, మారేపల్లి, సి.కోనాపూర్, మన్సాన్‌పల్లి గ్రామాల్లో విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. సమయానికి విద్యుత్ అందక పంటలు ఎండిపోతుండగా, రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.
పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్నాయని, విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయి ప్రమాదకర స్థితిలో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పాత స్తంభాల స్థానంలో ఎత్తైన కొత్త స్తంభాలు ఏర్పాటు చేసి, విద్యుత్ లైన్లను సురక్షితంగా మార్చాలని డిమాండ్ చేశారు.
కొండాపూర్ మండలంలో విద్యుత్ సరఫరా నిర్వహణలో అధికారులు, లైన్‌మెన్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించిన డప్పు రాజు, వెంటనే స్పందించి రైతులకు, గృహ వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే బహుజనసేన ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మౌలానా, దుర్గయ్య, పాషా, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

