అర్హతల్లో మార్పుల్లేవు.. ఆగస్టు 31 వరకు అవకాశం.. గతంలో ఇచ్చిన దరఖాస్తులకూ పరిగణన..
హైదరాబాద్, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): అర్హులైన పేదలు, బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో చేయూత పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తొలి విడతలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, పైలేరియా, తలసేమియా, సికిల్సెల్, హీమోఫీలియా, ఇతర రక్త సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న అర్హులకు పింఛన్లు మంజూరు చేయనున్నారు.
కొత్త పింఛన్లకు సంబంధించి అర్హత నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో జారీ చేసిన సంబంధిత జీవోలు, నిబంధనల ప్రకారమే అర్హతలను పరిశీలించనున్నారు. ప్రజాపాలన, 99 రోజుల ప్రగతి ప్రణాళిక గ్రామసభలు, ప్రజావాణి ద్వారా గతంలో దరఖాస్తు చేసుకున్న వారినీ ఈ ప్రక్రియలో పరిగణనలోకి తీసుకుంటారు.
ఇప్పటికే దరఖాస్తు చేసి అవసరమైన ధ్రువపత్రాలు సమర్పించిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. గతంలో దరఖాస్తు చేసినా పత్రాలు సమర్పించని వారు, ఇప్పటివరకు దరఖాస్తు చేయని అర్హులు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
వితంతువులకు భర్త మరణ ధ్రువపత్రం, ఒంటరి మహిళలకు విడాకులు లేదా విడిపోవడానికి సంబంధించిన ధ్రువపత్రం, అవసరమైతే స్థానిక విచారణ నివేదిక తీసుకోనున్నారు. గీత కార్మికులకు ఎక్సైజ్ శాఖ, చేనేత కార్మికులకు చేనేత శాఖ, పైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ నుంచి ధ్రువీకరణ తీసుకోనున్నారు.
దరఖాస్తుల పరిశీలన అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులు విచారణ చేపట్టి అర్హుల జాబితాను జిల్లా స్థాయికి పంపిస్తారు. కలెక్టర్ ఆమోదంతో పింఛన్ల మంజూరు ప్రక్రియ పూర్తవుతుంది.
కొత్త పింఛన్ల కోసం ఆగస్టు 31 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల వివరాలను చేయూత పోర్టల్లో నమోదు చేసే ప్రక్రియను కూడా ప్రారంభించనున్నారు. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకునేలా స్వయం సహాయక సంఘాల సమాఖ్యలు సహకరించాలని ప్రభుత్వం సూచించింది.

