– భారీ ఎత్తున నిర్వహణకు కమిటీల ఏర్పాటు
సంగారెడ్డి, జూలై 02 (నవజ్యోతి ప్రతినిది) :
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో టియుడబ్ల్యూజే(ఐజేయు) జిల్లా మహాసభను ఈనెల 9వ తేదీన భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం ఏ కే పైసల్, జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి , జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ తెలిపారు. మహాసభ ఏర్పాట్లకు సంబంధించి గురువారం సంగారెడ్డి లోని టీఎన్జీవో భవన్ లో సమీక్ష జరిగింది.

ఈ సందర్భంగా పైసల్ మాట్లాడుతూ జిల్లాలోని జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం లక్ష్యంగా ఈ సభను నిర్వహిస్తున్నామని అన్నారు. చాలామంది అర్హులైన జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇంకా రాలేదని, హెల్త్ కార్డు సమస్య ఇంకా పెండింగ్ లోనే ఉందని చెప్పారు. అదే సమయంలో ఉద్యోగ భద్రత కూడా లేకుండా పోయిందని అన్నారు. వీటన్నిటిపై చర్చించడానికి గాను 9వ తేదీన సంగారెడ్డిలో మహాసభ జరుపుతున్నామని వివరించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు పాత్రికేయులకు పదివేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నామని ప్రకటించారు.
జిల్లా అధ్యక్షుడు బండారు యాదగిరి మాట్లాడుతూ జిల్లాలోని పాత్రికేయుల సమస్యల పరిష్కారమే తమ యూనియన్ లక్ష్యం అని వెల్లడించారు. అంతేకాకుండా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, చిన్న మధ్య తరహా పత్రికలు, ఉర్దూ పత్రికలు,కేబుల్ టీవీ, ఫోటోగ్రాఫర్లు ,వీడియో గ్రాఫర్లు దశాబ్దాలుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నారని అన్నారు. వారందరికీ ఈ మహాసభ ద్వారా భరోసా కల్పించనున్నట్లు చెప్పారు. అర్హులైన వారందరికీ ఇంటి స్థలం, హెల్త్ కార్డు, అక్రిడేషన్ కార్డులను సాధించడం జరుగుతుందన్నారు.
మహాసభ నిర్వహణకు ఆహ్వాన కమిటీ, రిజిస్ట్రేషన్ కమిటీ, ఫుడ్ కమిటీ, వేదిక అలంకరణ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి రామనారాయణతో పాటు జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు ఇతర ముఖ్యులు మహాసభకు హాజరవుతున్నందున అన్ని మండలాల నుంచి నియోజకవర్గ కేంద్రాల నుంచి పెద్ద ఎత్తున పాత్రికేయులు తరలి కావాలని కోరారు. ఈ మేరకు ఆయా ప్రాంతాలలో సమన్వయం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ నాడు ఉమ్మడి రాష్ట్రంలో నేడు తెలంగాణలో జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం గళమెత్తుతున్న సంఘం తనదేనని అన్నారు. అన్ని విభాగాల జర్నలిస్టుల ఐక్యతకు పాటుపడుతూ, వారి సంక్షేమానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మహాసభ పోస్టర్ ను విడుదల చేశారు. జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు అనిల్ ప్రధాన కార్యదర్శి ఆసిఫ్, జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధిక్, జిల్లా కోశాధికారి మసూద్, ఇతర ముఖ్యులు సిద్దన్న పాటిల్, శ్రీనాథ్, బసవరాజ్, హాజీ, వెంకటరెడ్డి, బాసిత్ ,అన్వర్, మతీన్, విల్సన్, కిషోర్, ఈశ్వర్ చవాన్, లక్ష్మణ్, సంగమేశ్వర్, ప్రభాకర్, అంజయ్య, రమేష్ గౌడ్, వెంకటేష్, రవీందర్, సత్తార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

