కోటలో జాతీయ జెండా ఆవిష్కరణ.. అవినీతిపై పోరాటమే నిజమైన స్వాతంత్ర్యమన్న సీఎం
ప్రత్యేక ఆకర్షణగా త్రిష.. విజయ్ తల్లిదండ్రులతో కలిసి హాజరు
చెన్నై, ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి): తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి.జోసెఫ్ విజయ్ తొలిసారిగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. చెన్నైలోని చారిత్రక ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో శనివారం నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు.
జెండా ఆవిష్కరణకు ముందు విజయ్‌కు పోలీసు బలగాలు పరేడ్ ద్వారా గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ప్రాణత్యాగాలు చేసిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించారు. 386 ఏళ్ల చరిత్ర కలిగిన ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేసే అవకాశం తనకు లభించడం గర్వకారణమని విజయ్ పేర్కొన్నారు.
అవినీతిపై పోరాటమే నిజమైన స్వాతంత్ర్యం
తమిళనాడును లంచం, అవినీతి నుంచి కాపాడటం కూడా స్వాతంత్ర్య పోరాటంతో సమానమైనదేనని విజయ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కులం, మతం, భాష, ప్రాంతం వంటి భేదాలను అధిగమించి ప్రజలంతా ఒక్కటిగా నిలిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్టని అన్నారు.
‘పుట్టుకతోనే అన్ని ప్రాణులూ సమానమే’ అనే భావనను ఆధారంగా చేసుకుని తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. లంచం, అవినీతి, మాదకద్రవ్యాల సంస్కృతికి వ్యతిరేకంగా, మహిళల భద్రత, సామాజిక న్యాయం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.
రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ లేదు
కేంద్ర ప్రభుత్వంతో పరిపాలనా పరంగా అవసరమైన సహకారం కొనసాగిస్తామని విజయ్ తెలిపారు. అయితే తమిళనాడు హక్కులు, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలను తమ ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన ప్రజలకు ఉపయోగకరమైన పథకాలను కొనసాగిస్తామని చెప్పారు.
జయలలిత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లను కొనసాగిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహార పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు వెల్లడించారు.
15 మంది పోలీసులకు సీఎం పతకాలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అత్యుత్తమ దర్యాప్తు, ప్రజాసేవ అందించిన 15 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి తమిళనాడు ముఖ్యమంత్రి పోలీస్ పతకాలను ప్రకటించారు. వీరిలో తొమ్మిది మంది మహిళా పోలీసు అధికారులు ఉన్నారు. దర్యాప్తులో ప్రతిభకు 10 మందికి, ప్రజాసేవలో విశేష సేవలకు ఐదుగురికి పతకాలు ఇవ్వనున్నారు. ఒక్కొక్కరికి 8 గ్రాముల బంగారు పతకంతో పాటు రూ.25 వేల నగదు పురస్కారం అందించనున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా త్రిష
వేడుకలకు సినీనటి త్రిష హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పసుపు రంగు చీరలో వచ్చిన ఆమె ముందు వరుసలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. విజయ్ తల్లిదండ్రులు ఎస్.ఏ. చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్‌లతో కలిసి త్రిష కూర్చున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. త్రిష తల్లి ఉమా కూడా కార్యక్రమానికి హాజరయ్యింది
విజయ్ కుటుంబ సభ్యులతో త్రిష పలకరించుకున్న దృశ్యాలు కూడా వైరల్‌గా మారాయి. కార్యక్రమంలో విజయ్, త్రిష ఇద్దరూ సెల్యూట్ చేస్తున్న దృశ్యాలు కూడా సామాజిక మాధ్యమాల్లో చర్చకు వచ్చాయి. అయితే త్రిష–విజయ్ వ్యక్తిగత సంబంధంపై వస్తున్న ఊహాగానాలకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు.
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుక కావడంతో ఫోర్ట్ సెయింట్ జార్జ్‌లో జరిగిన కార్యక్రమం రాజకీయంగా, ప్రజల దృష్టిలోనూ ప్రాధాన్యం సంతరించుకుంది.

