📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్మహేశ్‌ బర్త్‌డేకు ‘వారణాసి’ స్పెషల్‌ ట్రీట్‌.. రుద్రగా కొత్త లుక్‌

మహేశ్‌ బర్త్‌డేకు ‘వారణాసి’ స్పెషల్‌ ట్రీట్‌.. రుద్రగా కొత్త లుక్‌

X వేదికగా వారణాసి టీం విడుదల చేసిన మహేష్ బాబు ఫోటోలు..

 

ఆఫ్రికా షెడ్యూల్‌ నుంచి రెండు స్టిల్స్‌ విడుదల.. మహేశ్‌–ప్రియాంక ఫొటోతో సందడి..

హైదరాబాద్‌, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ నుంచి అభిమానులకు ప్రత్యేక కానుక అందింది. మహేశ్‌బాబు పోషిస్తున్న ‘రుద్ర’ పాత్రకు సంబంధించిన రెండు కొత్త స్టిల్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆఫ్రికాలోని కిలిమంజారో, మసాయి మారా ప్రాంతాల్లో జరిగిన షూటింగ్‌ సందర్భంగా ఈ చిత్రాలను తీసినట్లు రాజమౌళి వెల్లడించారు.

రుద్ర పాత్ర గురించి రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రుద్ర తనకంటే ఎంతో పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చడానికి పుట్టాడని, తాను కోరుకోకపోయినా ఒక విధిని మోస్తున్నాడని పేర్కొన్నారు. అతడిలో చమత్కారం, సున్నితత్వం, తీవ్రత ఉన్నాయని, మహేశ్‌ ఆ పాత్రకు ఇవన్నీ తీసుకొచ్చాడని ప్రశంసించారు. తీవ్రతతో పాటు సున్నితత్వాన్ని ఒకేసారి చూపించడం చాలా కొద్దిమందికే సాధ్యమని అన్నారు.

ఆఫ్రికా లొకేషన్లపై రాజమౌళి ప్రశంసలు

ఆఫ్రికా లొకేషన్ల గురించి కూడా రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కిలిమంజారో, మసాయి మారా పరిసరాల్లో చిత్రీకరణ తనను ఆశ్చర్యపరిచిందని, అక్కడి ప్రకృతి అందాలను ఏ సెట్‌ కూడా అందించలేదని చెప్పారు. కొన్ని ఉదయాల్లో తమ ముందున్న దృశ్యాలను 1.43:1 ఐమాక్స్‌ ఫ్రేమ్‌ కూడా పూర్తిగా ఇమడ్చలేనంత అద్భుతంగా అనిపించిందని అన్నారు.

మహేశ్‌–ప్రియాంక ఫొటో వైరల్‌

మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా ‘వారణాసి’ టీమ్‌ ఎక్స్‌లో మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా కలిసి ఉన్న ఫొటోను కూడా షేర్‌ చేసింది. ప్రియాంక సైతం ఆఫ్రికా షూటింగ్‌ సమయంలో మహేశ్‌తో దిగిన బీటీఎస్‌ ఫొటోను పంచుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఆఫ్రికా షెడ్యూల్‌ను ‘అల్టిమేట్‌ అడ్వెంచర్‌’గా అభివర్ణించింది.

భారీ తారాగణంతో ‘వారణాసి’

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రా జోనస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మహేశ్‌ ‘రుద్ర’గా, ప్రియాంక ‘మందాకిని’గా, పృథ్వీరాజ్‌ ‘కుంభ’గా కనిపించనున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాగే అడ్వెంచర్‌ కథాంశంతో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఆఫ్రికాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కొనసాగుతోంది.

2027 ఏప్రిల్‌ 7న విడుదల

‘వారణాసి’ని 2027 ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!