📄 ePaper
Friday, October 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లే టార్గెట్‌.. రాగి తీగల ముఠా అరెస్ట్!

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లే టార్గెట్‌.. రాగి తీగల ముఠా అరెస్ట్!

29 ట్రాన్స్‌ఫార్మర్లు ధ్వంసం.. మెదక్‌లో మరో 23 చోరీలు
ముగ్గురు నిందితుల అరెస్ట్‌.. మరో వ్యక్తి పరారీ
కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 (నవజ్యోతి ప్రతినిధి):
కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి
రాగి తీగలను చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
గత ఫిబ్రవరి నుంచి కామారెడ్డి జిల్లాలో 29, మెదక్‌ జిల్లాలో మరో 23 ట్రాన్స్‌ఫార్మర్లను
ధ్వంసం చేసి రాగిని ఎత్తుకెళ్లినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు.

🔍 విద్యుత్‌ సరఫరా సమాచారంతో నిఘా

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు నిలిచిపోయిన సమయాలకు సంబంధించిన సాంకేతిక సమాచారాన్ని
విద్యుత్‌ శాఖ నుంచి పోలీసులు సేకరించారు. ఆ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని
ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి ముఠా కదలికలను గుర్తించే ప్రయత్నం చేశారు.

ఈ నెల 9న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు, విద్యుత్‌ శాఖ సిబ్బంది ప్రయత్నించగా
వారు వారిపై దాడి చేసి పరారైనట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ప్రత్యేక కేసు నమోదు చేశారు.
గురువారం రాత్రి భిక్కనూర్‌ పరిధిలో నేరానికి యత్నిస్తున్న సమయంలో పక్కా వ్యూహంతో
నిందితులను పట్టుకున్నట్లు వెల్లడించారు.

👥 ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు

ముఠాలో మొత్తం నలుగురు సభ్యులు ఉన్నారని, వారంతా
ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములని ఎస్పీ తెలిపారు.
వీరు ఇతర రాష్ట్రానికి చెందినవారని పేర్కొన్నారు.

అరెస్టైన వారిని బల్బీర్‌ సింగ్‌, రూప్‌ సింగ్‌, రతన్‌చంద్‌గా గుర్తించారు.
మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు.

నిందితులపై భోపాల్‌, నార్సింగి తదితర ప్రాంతాల్లో దోపిడీలు, ఇళ్ల దొంగతనాలు,
ట్రాన్స్‌ఫార్మర్‌ చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకరిపై గతంలో
పీడీ చట్టం కింద కేసు నమోదై ఏడాది జైలు శిక్ష అనుభవించినట్లు
ఎస్పీ వెల్లడించారు.

🌙 పగలు రెక్కీ.. రాత్రి రాగి చోరీ

విలాసవంతమైన జీవితం గడపడం, సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో
నిందితులు చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు.

హైదరాబాద్‌ పరిసరాలు, శివారు ప్రాంతాల్లో పగటిపూట రెక్కీ నిర్వహించి,
రాత్రి సమయంలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను
లక్ష్యంగా చేసుకునేవారని
చెప్పారు.

ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని రాగి తీగలను తొలగించి
తీసుకెళ్లేవారని, అనంతరం హైదరాబాద్‌లోని కొనుగోలుదారులకు విక్రయించేవారని
పోలీసులు గుర్తించారు.

🛠️ పనిముట్లు.. వాహనం స్వాధీనం

నిందితుల నుంచి ద్విచక్ర వాహనం, మొబైల్‌ఫోన్‌, రంపపు బ్లేడ్లు,
కటింగ్‌ ప్లేయర్లు, కట్టర్లు, సుత్తులు, ఇనుప రాడ్లు తదితర
చోరీకి ఉపయోగించిన పనిముట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చోరీ చేసిన రాగి తీగలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
రాగిని కొనుగోలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు ఒక మధ్యవర్తిని
పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి.

⚡ ట్రాన్స్‌ఫార్మర్‌ అర్ధరాత్రి నిలిచిపోతే.. వెంటనే సమాచారం ఇవ్వాలి

వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లకు దొంగతన నిరోధక బోల్టులు ఏర్పాటు చేయాలని
విద్యుత్‌ శాఖ అధికారులను ఎస్పీ రాజేశ్‌ చంద్ర కోరారు.

గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో ట్రాన్స్‌ఫార్మర్‌ ఉన్నట్టుండి నిలిచిపోతే
ప్రజలు వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా డయల్‌ 112కు
సమాచారం అందించాలని సూచించారు.

సకాలంలో సమాచారం అందితే నిందితులను సంఘటనా స్థలంలోనే పట్టుకునే అవకాశం
ఉంటుందని ఎస్పీ తెలిపారు.

👮 పోలీసులకు ఎస్పీ అభినందనలు

కేసును ఛేదించిన డీఎస్పీ మధుసూదన్, భిక్కనూర్‌ సీఐ జగడం నరేష్, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌,
ఎస్సై అనిల్ కుమార్, భిక్కనూర్‌ ఎస్‌హెచ్‌ఓతో పాటు ఇతర పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
నిందితులను పట్టుకునే క్రమంలో గాయపడినా పోలీసులకు సహకరించిన విద్యుత్‌ శాఖ
సిబ్బందిని కూడా ప్రశంసించారు. వారికి ప్రశంసాపత్రాలు, రివార్డులు
అందజేశారు.

రైతులకు కీలక సూచన:
ట్రాన్స్‌ఫార్మర్‌ అకస్మాత్తుగా నిలిచిపోవడం, పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు
లేదా వాహనాల సంచారం కనిపించడం వంటి సందర్భాల్లో ఆలస్యం చేయకుండా పోలీసులకు
సమాచారం అందించడం ద్వారా చోరీలను అడ్డుకునేందుకు అవకాశం ఉంటుంది.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!