ప్రతి ఇంటికి సీసీ కెమెరా.. విలువైన వస్తువులు ఇంట్లో పెట్టొద్దు.. అనుమానాస్పద వ్యక్తులపై 112కు సమాచారం…
తూప్రాన్, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి నవీన్):
తూప్రాన్ సర్కిల్ పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ వెంకట్ రాజా గౌడ్ సూచించారు. ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బు, బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని కోరారు. ఊరికి వెళ్లేటప్పుడు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలని లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని సూచించారు.
ముఖ్యంగా ప్రతి ఇంటికి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీఐ విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
‘ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం’ అని పేర్కొన్నారు. ప్రతి కాలనీతో పాటు ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే అనుకోని నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు దర్యాప్తునకు అవసరమైన కీలక ఆధారాలను సేకరించేందుకు ఉపయోగపడతాయని చెప్పారు.
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలను ప్రజలు గమనించాలని సీఐ సూచించారు. అనుమానం కలిగించే వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే
112కు సమాచారం ఇవ్వాలని కోరారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను గుర్తించడంతో పాటు నేరాలు జరగకుండా ముందస్తు నిరోధక చర్యలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
- ప్రతి ఇంటికి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలి.
- బంగారం, వెండి, నగదు వంటి విలువైన వస్తువులను భద్రంగా ఉంచాలి.
- ఊరికి వెళ్లేటప్పుడు విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరచాలి.
- అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు కనిపిస్తే 112కు సమాచారం ఇవ్వాలి.
సీసీ కెమెరాలు నేరాల దర్యాప్తులో ఆధారాలు అందించడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తాయని వెంకట్ రాజా గౌడ్ తెలిపారు. నేరాల నివారణకు పోలీసులతో పాటు ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు అనుమానాస్పద కదలికలను వెంటనే పోలీసుల దృష్టికి తీసుకువస్తే నేరాల నియంత్రణకు మరింత దోహదపడుతుందని సీఐ తెలిపారు.

